ఫాతిమానగర్‌ వద్ద కొత్త ఆర్వోబీ నిర్మాణం

16 Sep, 2016 00:32 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • 60 అడుగులతో ఫాతిమానగర్‌ ఆర్వోబీ నిర్మాణం
  • రోడ్ల అభివృద్ధితోనే నగర సుందరీకరణ
  • సెంట్రల్‌ లైటింగ్, ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి
  • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  •  
    సాక్షి, హన్మకొండ : కాజీపేట వద్ద రెండో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంపై నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపొందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. మునిసిపల్, ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనులను గుర్తించి అనుమతులు పొందాలన్నారు. టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించాలని గ్రేటర్‌ మేయర్, కమిషనర్లకు సూచించారు. అక్టోబర్‌ 15 నుంచి పనులు మొదలు పెట్టే విధంగా కృషి చేయాలన్నారు. 
     
    రెండో ఆర్వోబీ
    హన్మకొండ నుంచి హైదరాబాద్‌ మార్గంలో కాజీపేట వద్ద ఫాతిమానగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలె త్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తక్షణం మే సైట్‌ ఇన్స్‌పెక‌్షన్‌ చేసి నెలరోజుల్లో డీపీఆర్‌ రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు కడియం చెప్పారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌ వైపు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఎడమ వైపున సమాంతరంగా కొత్త వంతెన కట్టేందుకు అవకాశం ఉందన్నారు.ఈ వైపు ప్రైవేట్‌ నిర్మాణాలు ఎక్కువగా లేవని రైల్వే, సెయింట్‌ గాబ్రియల్‌ విద్యా సంస్థలకు చెందిన స్థలం ఉన్నట్లు వెల్లడించారు. వీరి సహకారంతో ఆర్వోబీ నిర్మాణ పనులు చేపడతామన్నారు. రైల్వే శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ (వంతెనలు) అశోక్‌ మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు.
     
    సెయింట్‌ గాబ్రియల్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్వోబీ విస్తరణకు ఏ మేరకు ల్యాండ్‌ అవసరం ఉందో తెలియజేస్తే తమ సంస్థ చైర్మన్‌తో చర్చిస్తామని తెలిపారు. నేషనల్‌ హైవేస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ గణపతిరెడ్డి మాట్లాడుతూ మరో ఆర్వోబీ నిర్మాణం అవసరం అని నెల రోజుల్లో డీపీఆర్‌ రూపొందించి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సమర్పిస్తామని తెలిపారు. ఆర్వోబీ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ అభ్యంతరాలు తెలిపితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేపడుతుందని ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ రవీందర్‌రావు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జి. పద్మ, మేయర్‌ నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌ సిరాజుద్దీన్‌, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరీ రమేశ్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ వాకాటి కరుణ, గ్రేటర్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, రహదారులు భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖ, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. 
     
    లోపాలు లేని డీపీఆర్‌
    ఇంజనీర్స్‌ డే రోజున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంజనీర్‌ అవతారం ఎత్తారు. నగర అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఇంజనీర్లకే ఇంజనీర్‌గా కడియం సూచనలు చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో లోటు పాట్లను గుర్తించి వాటిని సరిదిద్దారు. అలైన్‌మెంట్‌ రూపకల్పనతో చెరువులు, కుంటలు, ఆవాసాలకు ఇబ్బంది కలుగకుండా ఔటర్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌ రూపొందించాలన్నారు. ముందుగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపించి క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత డీపీఆర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  కడియం సూచనల వల్ల ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు పొడవును తగ్గి, ప్రజలకు అనుకూలంగా అవుటర్‌ రింగురోడ్డు రూపుదిద్దుకోనుంది. 
     
    సమీక్షలో చర్చించిన ఇతర అంశాలు
    – కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వయా కేయూసీ రోడ్ల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించగా.. భూసేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు సమాధానమిచ్చారు. గోపాలపురం
     క్రాస్‌ రోడ్డు వరకు ఎలాంటి సమస్య లేదు. గోపాలపురం ఎక్స్‌రోడ్డు నుంచి కేయూసీ వరకు భూసేకరణ సమస్యలు ఉంటే కలెక్టర్‌ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
    – అమరవీరుల స్థూపం నుంచి నాయుడు పెట్రోల్‌ పంపు రోడ్డు పనులు పూర్తయి, రెండు నెలలు గడిచినా ట్రాఫిక్‌ లైట్స్, డివైడర్లు, రోడ్లకు ఇరువైపులా లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పది రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
    – కడిపికొండ నుంచి టయోటా షోరూం రోడ్డు పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటూ గడువు నిర్ధేశించారు.
    – లేబర్‌కాలనీ–ఎస్‌ఆర్‌నగర్‌–గరీబ్‌నగర్‌–ఏనుమాముల మార్కెట్‌ రోడ్డులో ట్రాఫిక్‌ లైట్లు, సెంట్రల్‌ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు. 
    – హన్మకొండ చౌరస్తా వయా పద్మాక్షిగుట్ట శాయంపేట హంటర్‌రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించగా భూసేకరణలో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. దీంతో 60 ఫీట్ల రోడ్లకి ప్రతిపాదనలు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. 
    – రాంపూర్‌ నుంచి ధర్మారం, పోచమ్మమైదాన్‌ నుంచి వరంగల్‌ చౌరస్తా రోడ్లకు డీపీఆర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పోచమ్మమైదాన్‌ నుంచి వరంగల్‌ చౌరస్తా రోడ్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు వివరించారు.
    – హసన్‌పర్తి నుంచి నాయుడు పెట్రోల్‌ పంపు రోడ్డుకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.
     
    సీఎం చెప్పిన పనులే కాలేదు
    సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం అవుతున్నందున అక్కడ కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపముఖ్యమంత్రి అందుకు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో కడియం మాట్లాడుతూ ‘ బాబూ... ఊరుకో... మైకుందని మాట్లాడితే ఎలా... వరంగల్ కే ఔటర్‌ దిక్కులేదు... మహబూబాబాద్‌కు కావాలా... స్వయంగా సీఎం నందనాగార్డెన్‌లో సమీక్షించి ఆదేశించిన పనులకే ఇంత వరకు డబ్బులు రాలేదు, పనులు మెదలుకాలేదు. అలాంటిది.. మహబూబాబాద్‌కు అంటే ఎలా.. కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి’ అంటూ సూచించారు.
మరిన్ని వార్తలు