బొకేలు వద్దు.. మొక్కలు ముద్దు

28 Dec, 2016 21:23 IST|Sakshi
బొకేలు వద్దు.. మొక్కలు ముద్దు
– నూతన సంవత్సర వేడుకల్లో మొక్కలను కానుకలుగా పంచుదాం 
- ఎస్పీ ఆకె రవికృష్ణ 
 
కర్నూలు :  నూతన సంవత్సర వేడుకల్లో మొక్కలను కానుకలుగా పంచుదామని ఎస్పీ ఆకె రవికృష్ణ పిలుపునిచ్చారు. ప్రాణం లేని ఖరీదైన బొకేలు, గ్రీటింగ్, స్వీట్స్‌కు బదులుగా ప్రాణమున్న మొక్కలను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుటకు ఉపయోగిద్దామని బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జాతీయ పర్యావరణ కన్వీనర్‌(జేవీవీ) సి.యాగంటప్ప ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక బృందం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా మొక్కలతో శుభాకాంక్షలు తెలిపి గ్రీట్‌ విత్‌ గ్రీన్‌ అనే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. భూమిపై ఉండే సకల జీవజాతులకు సేవ చేసే మొక్కలను శుభాకాంక్షలు తెలిపేందుకు ఉపయోగించాలని జిల్లా ప్రజలు యువతకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
 
    జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ మొక్కలను ఉపయోగించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడాన్ని అలవాటు చేద్దామన్నారు. ఒక బొకే ఖరీదుతో 8 నుంచి 10 మొక్కలను పంచవచ్చని, బొకే కన్నా మొక్క ఎక్కువ కాలం ఉంటుందన్నారు. జీవ మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జేవీవీ చిన్నారులు.. లహరి, భవ్య, కిరణ్మయి, జుహిర్మయి, జశ్వంత్‌ తదితరులు 'గ్రీట్‌ విత్‌ గ్రీన్‌' అనే కార్యక్రమంతో మొక్కలను ఎస్పీకి అందజేసి అడ్వాన్స్‌గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జేవీవీ జాతీయ పర్యావరణ రాష్ట్ర కోశాధికారి సురేష్‌కుమార్, జిల్లా కార్యదర్శి బాబు, దామోదర్‌రావు, నాయకులు మల్లేష్, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, కప్పట్రాళ్ల హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు