ఇకనైనా కరెన్సీ కష్టాలు తీరేనా?! | Sakshi
Sakshi News home page

ఇకనైనా కరెన్సీ కష్టాలు తీరేనా?!

Published Wed, Dec 28 2016 9:18 PM

50 days of demonetisation: cash rush still on

పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు పూర్తి
- రూ. 12.44 లక్షల కోట్లు వచ్చినట్లు 13న వెల్లడించిన ఆర్బీఐ
- రద్దు చేసిన పెద్ద నోట్లు అన్నీ బ్యాంకుల్లో జమ అయ్యాయా?
- 50 రోజుల్లో ఎన్నో నిబంధనలు మార్చినా ఫలితం శూన్యం
- ఇక నల్లధనం ఏమీ తేలే అవకాశం లేదంటున్న నిపుణులు
- ‘నల్లధనం’ నుంచి ‘నగదు రహితం’ వైపు మారిన సర్కారు
- మార్కెట్లోకి రూ. 5.92 లక్షల కోట్ల మేర కరెన్సీ పంపిణీ
- ఇంకా మూడు నుంచి ఆరు నెలల వరకూ కష్టాలు తప్పవా?




అవినీతి, నల్లధనం ఊడ్చివేత పేరుతో దేశ ప్రజల వద్ద ఉన్న దాదాపు రూ. 15 లక్షల మేర నగదును రాత్రికి రాత్రి చెల్లదని ప్రకటించి నేటికి 50 రోజులు గడిచిపోయాయి. ఈ 50 రోజుల్లో దేశం దాదాపుగా అతలాకుతలమైపోయింది. ప్రజలందరూ బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూల్లో నల్చుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సుమారు 150 మంది ప్రాణాలు కూడా కోల్పాయరు. నోట్లు రద్దు ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రోజు వారీ కూలీలు, చిన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నారు. వ్యవసాయరంగం కుదేలైంది. కానీ.. ప్రభుత్వం ఆశించిన విధంగా భారీ మొత్తంలో నల్లధనమేమీ తేలలేదు. నిజానికి రద్దు చేసిన నోట్ల విలువ రూ. 14.18 లక్షల కోట్లుగా ఆర్బీఐ నివేదిక చెప్తోంటే.. ఆ మొత్తం ఇప్పటికే బ్యాంకుల్లో జమ అయినట్లు అనధికార వర్గాల సమాచారం.

ఆర్బీఐ డిసెంబర్13వ తేదీన అధికారికంగా వెల్లడించిన లెక్క ప్రకారం.. అప్పటికే రూ. 12.44 లక్షల కోట్లు డిపాజిట్అయ్యాయి. ఇప్పటికి మిగతా మొత్తం కూడా దాదాపుగా జమ అయినట్లు భావిస్తున్నారు. నల్లధనం బయటపడే అవకాశం లేదన్న సూచనలు ముందుగానే పొడసూపడంతో కేంద్ర ప్రభుత్వం ‘నల్లధనం’ మీద నుంచి ‘నగదు రహితం’ మీదకు మాట మార్చింది. దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు.. నల్లడబ్బు తెల్లగా మారకుండా చూడటానికి.. నగదు మార్పిడి, కొత్త నోట్ల డిపాజిట్కు సంబంధించి ఈ 50 రోజుల్లో పలుమార్లు నిబంధనలు సవరించి ఆ రకంగానూ విమర్శలను మూటగట్టుకుంది. ఎప్పుడు ఏ కొత్త నిబంధన వస్తుందో.. అదెలా మారుతుందోనన్న సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. మరోవైపు నల్లకుబేరులపై సమాచారాన్ని అందుకుని భారీ స్థాయిలో దాడులూ నిర్వహించింది. లెక్క చెప్పని పాత, కొత్త నోట్లతో చాలా మంది పట్టుబడ్డారు. అయినా అది వందల కోట్ల నుంచి రెండు మూడ వేల కోట్లలోనే ఉంది.

మొత్తం మీద.. 50 రోజుల్లో నగదు కష్టాలు తీరతాయంటూ ప్రధాని ప్రకటించిన గడువు ఎట్టకేలకు ముగిసిపోయింది. ఇప్పటికి రూ. 5.92 లక్షల కోట్ల నగదును మార్కెట్లోకి పంపించినట్లు ఆర్బీఐ తాజాగా చెప్పింది. అంటే ఇంకా దాదాపు తొమ్మిది, పది లక్షల కోట్లు బ్యాంకుల్లోనే చిక్కుకుని ఉన్నాయి. అందులో ఎంత మొత్తం విడుదల చేస్తారన్నదానిపై ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో ఎంతలేదన్నా ఇంకా మూడు నుంచి ఆరు నెలల వరకూ కరెన్సీ కష్టాలు కొనసాగుతాయనే నిపుణులు భావిస్తున్నారు. ఈ 50 రోజుల్లో ముఖ్యమైన పరిణామాలివీ...

రాత్రికి రాత్రే పెద్ద నోట్ల రద్దు: 2015 నవంబర్8వ తేదీ అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ఆ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. అయితే.. ఆ నోట్లు డిసెంబర్15వ తేదీ వరకూ వంట గ్యాస్ సిలిండర్లు కొనడానికి, రైల్వే టికెట్లు కొనడానికి, మందుల షాపుల్లోనూ పాత నోట్లు చెల్లుబాటు అయ్యేందుకు అవకాశమిచ్చారు.

కొత్త నోట్ల కోసం తిప్పలు: నోట్లు రద్దు చేసిన తర్వాత రెండు రోజుల పాటు బ్యాంకులు మూసివేశారు. మూడు రోజుల తర్వాత రిజర్వు బ్యాంకు కొత్త రూ. 2000, రూ. 500 నోట్లను విడుదల చేసింది. కానీ.. అవి అతి తక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పార్టీల నుంచి మిశ్రమ స్పందన..: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం బలంగా సమర్థించుకుంది. తృణమూల్కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు చెందిన జనతాదళ్(యు) వంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈ చర్యకు మద్దతు తెలిపాయి.

పార్లమెంటులో గందరగోళం..: నోట్ల రద్దు అంశంపై చర్చ విషయంలో ప్రభుత్వ  ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుస వాయిదాలతో తుడిచిపెట్టుకుపోయాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్య పెద్ద పొరపాటు నిర్వహణ అని అభివర్ణించారు. పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘దేవుడి కోసం.. మీ పని మీరు చేయండి’ అని పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నగదు రహితంపై దృష్టి..: పెద్ద నోట్ల రద్దు అనంతరం.. నగదు రహిత ఆర్థికవ్యవస్థ వైపు పయనించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర ప్రభుత్వం బలంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా.. సెమీక్లోజ్డ్ప్రీపెయిడ్పేమెంట్ఇన్స్ట్రుమెంట్ల (పీపీఐల) బ్యాలెన్స్పరిమితిని ఆర్బీఐ నవంబర్22న రెట్టింపు చేస్తూ రూ. 20,000 కు పెంచింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ డిసెంబర్8వ తేదీన 11 చర్యలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం సంస్థల్లో క్రెడిట్, డెబిట్కార్డులు, ఈవ్యాలెట్లు, మొబైల్వ్యాలెట్లతో పెట్రోలు, డీజిల్కొనుగోలు చేస్తే 0.75 శాతం రాయితీ ఇవ్వటం ఆ చర్యల్లో ఒకటి.

ప్రభుత్వ లక్కీ డ్రా పథకాలు..: డిజిటల్చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా.. వ్యాపారవేత్తల కోసం ‘డిజి ధన్యోజన’, వినియోగదారుల కోసం ‘లక్కీ గ్రాహక్యోజన’ పేరుతో రెండు లక్కీ డ్రా పథకాలను కూడా కేంద్రం ప్రకటించింది. విజేతలను లక్కీ గ్రాహక్యోజన కింద రోజు వారీగా, డిజి ధన్వ్యాపార్యోజన కింద వారం వారీగా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది మే 14వ తేదీన మెగా డ్రా నిర్వహించి రూ. 1 కోటి బహుమతిగా ఇస్తారు. ఆ తర్వాత పథకాన్నీ సమీక్షిస్తారు.

భారీ స్థాయిలో ఐటీ దాడులు: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయ పన్ను శాఖ, పోలీసు విభాగాలు దేశ వ్యాప్తంగా అక్రమ నగదు నిల్వలు, ఆదాయానికి మించిన ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామమోహనరావు, ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు చేయడం, రూ. 23 లక్షల విలువైన కొత్త కెరెన్సీ నోట్లు, రూ. 6 లక్షల రద్దయిన నోట్లను కనుగొనడం సంచలనం సృష్టించింది. ఫలితంగా ఆయన ఆ పదవిని కోల్పోయారు.

మూడున్నర వేల ఐటీ నోటీసులు..: నవంబర్8వ తేదీ నుంచి ఇప్పటివరకూ.. వివిధ పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలకు సంబంధించి ఐటీ విబాగం 3,589 నోటీసులు జారీ చేసినట్లు ఈ నెల 25న ఒక కథనం వెలువడింది. అలాగే.. 201415 సంవత్సరంలో అధిక విలువ లావాదేవీలు నిర్వహించి కూడా 201516లో పన్ను రిటర్నులు దాఖలు చేయని 67.54 లక్షల మందిపై చర్యలు చేపట్టడానికి సమాయత్తమవుతున్నట్లు ఆ కథనం చెప్తోంది.

పౌరుల నిఘా సమాచారం..: పెద్ద నోట్ల రద్దు అనంతరం.. నల్లధనం దాస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి blackmoneyinfo@incometax. gov.in కు ఈమెయిల్ద్వారా అందించాలంటూ కేంద్రం పిలుపునిచ్చింది. దీంతో డిసెంబర్20వ తేదీ నాటికి దాదాపు 4,000 ఈమెయిళ్లు వచ్చాయి. దేశ పౌరులు అందిస్తున్న సమాచారం ఆధారంగా.. లెక్క చెప్పని సంపద గల వారిపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధాని మోదీ తన మన్కి బాత్ప్రసంగంలో పేర్కొన్నారు.

నల్లధనం వెల్లడికి గరీబ్కళ్యాణ్యోజన..: లెక్క చెప్పని నగదు ఆదాయాన్ని వెల్లడించడానికి ప్రధానమంత్రి గరీబ్కళ్యాణ్యోజన పేరుతో డిసెంబర్17న కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది మార్చి 13వ తేదీతో ముగుస్తుంది. ఈ పథకం కింద బ్యాంకుల్లో జమ చేసిన ‘లెక్క చెప్పని ఆదాయం’పై 50 శాతం పన్ను, సర్చార్జీ విధిస్తారు. అలాగే.. జమ చేసిన మొత్తంలో నాలుగో వంతు నగదును నాలుగేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల్లోనే జమచేసి ఉంచాలి. ఈ పథకం కింద వెల్లడించిన సమాచారాన్ని విచారణ కోసం ఉపయోగించరు.

ఇక బినామీ ఆస్తులపై చర్యలు..: నల్లధనం, అవినీతిపై పోరాటంలో భాగంగా ఇక బినామీలపై చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ తన మన్కీ బాత్ప్రసంగంలో వెల్లడించారు. బినామీ ఆస్తులు ఉన్న వారిపై దశాబ్దాల కాలం నాటి చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఆ చట్టాన్ని మరింత సమర్థవంతం చేసేందుకు ఆయా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలన్నీ చేపడతామని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఆ నోట్లు ఉంచుకోవడం నేరం..?: పెద్ద నోట్ల రద్దుపై న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా.. కేంద్ర కేబినెట్తాజాగా ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను ఆర్బీఐలో జమ చేయడానికి ఇచ్చిన మార్చి 31వ తేదీ గడువు ముగిశాక కూడా.. ఆ నోట్లను ఎవరైనా కలిగివుండటం నేరం అవుతుందని, వారు జరిమానా, జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంశం కూడా ఈ ఆర్డినెన్స్లో ఉన్నట్లు చెప్తున్నారు.

పదే పదే మారిన నిబంధనలు...
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన నియమనిబంధనలు, పరిమితులను ప్రభుత్వం పదే పదే మార్చుతూ వచ్చింది. అదెలాగంటే...

  • నవంబర్ 8: మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘నవంబర్10 నుంచి నవంబర్24వ తేదీ వరకూ నోట్ల మార్పిడిపై రూ. 4,000 పరిమితి ఉంటుంది. నవంబర్25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఈ పరిమితిని పెంచుతాం’ అని చెప్పారు. ‘రద్దయిన నోట్లను వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, ఆర్బీఐ శాఖల్లో డిసెంబర్30వ తేదీ వరకూ మార్చుకోవచ్చు’ అని నవంబర్ 8 రాత్రి ఆర్థికశాఖ పేర్కొంది.   
  • నవంబర్ 11: ‘రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునే సదుపాయం దాదాపు 50 రోజుల పాటు అందుబాటులో ఉంది. ప్రజలు సహనం వహించాలని, డిసెంబర్30వ తేదీ లోగా వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది.   
  • నవంబర్ 13: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే పరిమితిని రూ. 4,500 కు, ఏటీఎం నుంచి విత్డ్రా పరిమితిని రూ. 2,500 కు పెంచారు.
  • నవంబర్15: ఒకే వ్యక్తి రెండోసారి పాత నోట్ల మార్పిడికి రాకుండా నివారించడం కోసం వారి కుడి చూపుడు వేలిపై చెరగని ఇంకు ముద్ర వేయాలని నిబంధన అమలులోకి తెచ్చారు. రెండు రోజులకే ఈ చర్యను ఉపసంహరించారు.
  • నవంబర్ 17: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే పరిమితిని రూ. 2,000 కు తగ్గించారు. బ్యాంకుల్లో కొత్త నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆర్బీఐ ఉద్ఘాటించింది.
  • నవంబర్ 24: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవడానికే తప్ప మార్చుకోవడానికి వీలు లేదని నిబంధనలు తెచ్చారు. ఆర్బీఐ శాఖల్లో పరిమితి మేరకు మార్చుకోవచ్చని చెప్పారు.
  • నవంబర్ 28: రద్దయిన పాత నోట్లు రూ. 8.45 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
  • డిసెంబర్7: రూ. 11.55 లక్షల కోట్ల మేర రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్అయినట్లు ఆర్బీఐ గవర్నర్వెల్లడించారు.
  • డిసెంబర్ 8: రూ. 4.27 లక్షల కోట్ల విలువైన నోట్లను మార్కెట్లోకి తిరిగి పంపినట్లు ఆర్బీఐ చెప్పింది.
  • డిసెంబర్13: రూ. 12.44 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు బ్యాంకులకు చేరాయని, రూ. 4.61 లక్షల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లోకి పంపించామని ఆర్బీఐ వెల్లడించింది.
  • డిసెంబర్ 19: ఎవరైనా సరే పాత నోట్లు రూ. 5,000 మొత్తానికి మించితే డిసెంబర్30వ తేదీ వరకూ కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాంకుల్లో జమ చేసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే.. కేవైసీ వివరాలు పూర్తిగా గల పౌరులకు ఈ నిబంధన వర్తించదంటూ సవరించింది.
  • డిసెంబర్21: బ్యాంకులు, ఏటీఎంలలో విత్డ్రాయల్ల ద్వారా రూ. 5.92 లక్షల కోట్లు నగదును మార్కెట్లోకి పంపించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
  • ఆస్పత్రులు, మందులషాపులు వంటి చోట్ల.. రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్ల చెల్లుబాటును ప్రకటించిన ప్రభుత్వం.. ఆయా లావాదేవీల్లో రూ. 500 నోట్ల చెల్లుబాటు గడువును డిసెంబర్15 వరకూ పెంచింది. అయితే.. రూ. 1000 నోట్ల చెల్లుబాటును నవంబర్24వ తేదీ రాత్రి నుంచే రద్దుచేసింది.

    (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)
     

Advertisement
Advertisement