రెండు కాదు.. ఐదు ఉండాలి

23 Nov, 2015 01:11 IST|Sakshi
రెండు కాదు.. ఐదు ఉండాలి

 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించడంలో మరింత మెరుగైన డిజైన్‌కు కృషి జరగాలని నీటిపారుదలరంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గాల్లో గోదావరి నదీ ప్రవాహపు దారిలో ప్రతిపాదించిన రెండు బ్యారేజీలకు తోడు మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. ఐదు నిర్మాణాల వల్ల పైప్‌లైన్ నిర్మాణం, వ్యయం తగ్గుతాయని, వీటికితోడు నౌకాయానం, జలవిద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో అన్నారం, సుండెళ్ల ప్రాంతం వద్ద బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలపై వ్యాప్కోస్ సర్వే చేస్తుండటం, జనవరి నుంచి పనులు ఆరంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆయన సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హనుమంతరావు ఇంకా ఏమన్నారంటే...

 నిర్ణయం సరైందే కానీ..
 సాంకేతికంగా చూస్తే తుమ్మిడిహెట్టి వద్ద కన్నా మేడిగడ్డ వద్దే నీటి లభ్యత అధికం. మేడిగడ్డ వద్ద ప్రాణహిత.. గోదావరిలో కలుస్తుంది. ఈ పరీవాహకంలో సగటు వర్షపాతం ఎక్కువ. అయితే తుమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తులో ఉంటే 100 మీటర్ల వద్ద మేడిగడ్డ ఉంటుంది. దీంతో తుమ్మిడిహెట్టి కంటే అదనంగా 52 మీటర్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అదనంగా పంపింగ్ చేయాల్సి రావడంతో 10 శాతం ఖర్చు అదనమవుతుంది. ఇదొక్కటే అననుకూల అంశం. అయితే నీటి లభ్యత ముఖ్యమైనందున మేడిగడ్డ తప్పనిసరి. వ్యాప్కోస్ సూచిస్తున్నట్లు రెండు బ్యారేజీలు సరిపోవు. మరో 3 బ్యారేజీలు కడితే ప్రయోజనాలు ఎక్కువ. కాళేశ్వరం వద్ద 4 మీటర్ల బ్యాక్‌వాటర్ లోతు ఉండే ప్రాంతంలో ఒక బ్యారేజీ నిర్మించాలి.

ఆ బ్యారేజీ లోపలే పంప్‌హౌజ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడి నుంచి 16 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేయాలి. దీని బ్యాక్‌వాటర్ మళ్లీ 4 మీటర్ల లోతు వచ్చినప్పుడు ఇంకో బ్యారేజీ నిర్మాణం చేయాలి. దీని నుంచి మరలా 16 మీటర్ల ఎత్తులో లిఫ్టు చేయాలి. ఇదే పద్ధతిన మూడు, నాలుగు, ఐదు బ్యారేజీల నిర్మాణం చేయాలి. అంటే ప్రతీ బ్యారేజీ వద్ద 12 మీటర్ల ఎత్తులో (మొత్తం 16 మీటర్ల ఎత్తులో 4 మీటర్ల లోతు ఉంటుంది కాబట్టి దాన్ని తీసివేయాలి) 5 బ్యారేజీలు కడితే మొత్తం 60 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లికి నీరు చేరుతుంది. ఒకవేళ ఎక్కడైనా బ్యారేజీ ఎత్తును పెంచుతూ పోతే నాలుగు కట్టినా సరిపోతాయి. దీనివల్ల ఎల్లంపల్లికి వరద వచ్చినప్పుడు నీరు పొర్లితే ఎల్లంపల్లి సహా 5 బ్యారేజీల్లో జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది.

నీరు పొర్లని సమయంలో మాత్రమే నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని రివర్సబుల్ పంపింగ్ అంటారు. ఈ విధానం నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉంది. ఇక 4 మీటర్ల కనీస లోతు ఉంటున్నందున నౌకాయానానికి అనువుగా ఉం టుంది. రెండు బ్యారేజీలు కడితే అది సాధ్యం కాదు. పైప్‌లైన్ నిర్మాణం ఉండనందున నీటి పారుదల నిరోధక ఒత్తిడి (ఫ్రిక్షనల్ లాస్) ఉండదు. పైప్‌లైన్ నిర్మాణమైతే మరో 50 మీటర్ల అదనపు ఎత్తుకు నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది.
 
 చేవెళ్లకు ప్రాణహితే సరి
 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు నీటిని అందించేందుకు ప్రాణహిత ప్రాజెక్టే అత్యుత్తమం. చేవెళ్లకు ప్రాణహిత ద్వారా ఇవ్వదలిచిన నీరు పూర్తిగా నికర జలాలు. కానీ పాలమూరు-రంగారెడ్డి ద్వారా చేవెళ్లకు నీరివ్వాలంటే అదనపు జలాలపై ఆధారపడాలి. నిజానికి కృష్ణా జలాల్లో అదనపు జలాలు కేవలం మూడేళ్లలో ఒకమారు మాత్ర మే లభ్యమవుతాయి. ప్రస్తుతం బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకొస్తే నాలుగేళ్లలో ఒకమారు మాత్రమే ఈ లభ్యత ఉంటుంది. కృష్ణా జలాల్లో 258 టీఎంసీల అదనపు జలాలను మహారాష్ట్ర, కర్ణాటకలకు ట్రిబ్యునల్ కేటాయించింది. ఏపీకి సైతం అదనపు జలాలు కేటాయించినా, పై రాష్ట్రాలు వినియోగించుకోకుండా ఉంటేనే అవి అందుబాటులోకి వస్తాయి. ఈ దృష్ట్యా చేవెళ్లకు ప్రాణహిత ద్వారానే నీటిని అందించడం మేలు.

మరిన్ని వార్తలు