వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం

11 May, 2017 23:04 IST|Sakshi
వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఆమోదం
ప్రభుత్వానికి పంపాలని తీర్మానం
కాకినాడ సిటీ : వ్యవసాయ పనులకు కూలీల కొరత సమస్య ఎదుర్కొంటున్నందున రైతులు, కూలీలకు ఉభయతారకంగా వ్యవసాయ పనులను ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేసేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) ఆమోదించి ప్రభుత్వానికి పంపాలని తీర్మానం చేసింది. గురువారం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ హాలులో దిశ కమిటీ సమావేశం ఎంపీ, కమిటీ చైర్మన్‌ మాగంటి మురళీమోహన్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం అందిస్తున్న 28 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలవుతున్న తీరును కమిటీ విస్తృతంగా సమీక్షించింది. సమావేశాన్ని చైర్మన్‌ మురళీమోహన్‌ ప్రారంభిస్తూ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లికార్జునను అభినందించారు. అభివృద్ధి, సంక్షేమాలకు దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలపై చర్చించేందుకు దిశ కమిటీ సమావేశాన్ని రంపచోడవరంలో నిర్వహించాలన్న కలెక్టర్‌ ప్రతిపాదనను చైర్మన్‌ స్వాగతిస్తూ కమిటీ తదుపరి సమావేశాన్ని రంపచోడవరంలోనే నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు లక్ష్యిత వర్గాలకు చేరేలా చూడాలని ఆదేశించారు. ప్రధాని సూచనల మేరకు తన నియోజకవర్గంలోని సంజీవపురం, రంగాపురం (అనపర్తి నియోజకవర్గం), ఉండేశ్వరపురం (రాజానగరం నియోజకవర్గం) గ్రామాలను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అధికారులు సహకరించాలని చైర్మన్‌ కోరారు. అనంతరం పథకాల వారీగా సుదీర్గ సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనులను పెద్ద ఎత్తున ఏజెన్సీ, అప్‌లాండ్‌ 30 మండలాల్లో చేపట్టాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరగా, డెల్టా ప్రాంతంలో కాల్వలో తూడు, డెక్క తొలగింపు పనులు చేపడితే రైతులకు ప్రయోజనకరంగా ఉండగలదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. డెల్టా ప్రాంతంలోని దేవాదాయ, పంచాయతీ చెరువుల అభివృద్ధిని మిషన్‌ కాకతీయ శైలిలో చేపట్టాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కోరారు. ఏజెన్సీ మండలాల్లో ఉపాధి హామీ పనుల వేతనాల చెల్లింపులో కూలీలను మోసగిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని కాజేసిన కూలీల సొమ్మును తిరిగి రాబట్టాలని ఎమ్మెల్సీ టి.రత్నాబాయి కోరారు. కూలీలకు గతంలో ఇచ్చినట్టు ఎంత కూలీ వచ్చిందో తెలిపే పే స్లిప్పులు జారీ చేయాలని, బ్యాంకులకు వెళ్లి కూలీ డ్రా చేసుకోలేక పోతున్నందున బిజినెస్‌ కరస్పాండెంట్‌ల ద్వారా చెల్లింపులు ఏర్పాటు చేయాలని విలీన మండలాల ఎంపీపీలు కోరారు. ఈ సమావేశంలో ఎంపీ తోట నరసింహం, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్‌ వి.విజయరామరాజు, ఎంపీపీలు, నామినేటెడ్‌ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు