ఎందుకొచ్చామురా.. దేవుడా..!

29 Oct, 2016 20:48 IST|Sakshi
వర్షంలో మహిళల అవస్థలు (ఫైల్‌)
* అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి
తీవ్ర ఇబ్బందులు పడిన మహిళలు, విద్యార్థులు
చీకట్లో ఎటువెళ్లాలో తెలియక అవస్థలు
 
ఎందుకు వచ్చామురా దేవుడా.. ఈ చంద్రబాబు మీటింగ్‌లేమిటో మా చావుకొచ్చింది.. కాలు కదపలేకపోతున్నాం.. ఎటు వెళ్లాలో తెలియడం లేదు.. ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో.. ఈ ఫోనులూ మూగబోయాయి.. మళ్లీ ఇంకోసారి మీటింగ్‌లంటూ అధికారులు ఒత్తిడి చేస్తే అప్పుడు చెబుతాం.. ఇదీ రాజధాని భవనాల శంకుస్థాపనకు వచ్చిన మహిళల ఆవేదన..ఊరిగాని ఊరు వచ్చారు..విద్యుత్‌ లేక ఎటుచూసినా అంధకారం అలుముకుంది..కాలు తీసి కాలు వేయాలంటే జర్రున జారింది..ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక..ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళన వారి కళ్లలో బిక్కుబిక్కుమంటూ కనిపింది.
 
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంత రైతులు భవనాల శంకుస్థాపన సభలకు వస్తే గొడవ చేస్తారని, బయటి ప్రాంతాల నుంచి జనాలను తరలించిన ప్రభుత్వం వారిని అష్టకష్టాల పాలు చేసింది. డ్వాక్రా సమావేశమని గుంటూరు జిల్లా వినుకొండ, కృష్ణా జిల్లా పామర్రు వంటి సుదూర ప్రాంతాల నుంచి మహిళలను రాజధాని శంకుస్థాపన సభకు తరలించారు. ఇక్కడకొచ్చాక జోరున వర్షం కురవడంతో కరెంటు లేక, సెల్‌ సిగ్నల్స్‌ రాక ఇళ్ల దగ్గర వారికి సమాచారం సైతం ఇవ్వలేకపోయారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటల వరకు సభ ప్రాంగంణం వద్దనే ఉండి వచ్చిన జనాలను తరలించేందుకు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే విశేష కృషి చేశారు.
 
కొంత మంది ఎటుపోవాలో తెలియక పార్కింగ్‌ ప్రాంతాల్లో ఉన్న బస్సుల్లోనే తల దాచుకున్నారు. ఐజీ సంజయ్, రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌లు తమ సిబ్బందితో వీరిని గుర్తించి రోడ్డుపైకి చేర్చారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు, ఆర్డీఎఫ్‌ బలగాలు భుజాలపై నీటి మూటలు వేసుకొని మోకాళ్ల లోతు బురదలో వెళ్లి ప్రజల దాహార్తి తీర్చారు. జేసీబీల సాయంతో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీశారు. రోడ్డు క్లియర్‌ చేయడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తీవ్రంగా శ్రమించాయి. ఒకదశలో ఉన్నతాధికారుల సీసీలు, డ్రైవర్‌ ఎక్కడనున్నారో కనుక్కోలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. డీఆర్‌డీఏ పీడీ హబీబ్‌ బాషా సభకు వచ్చిన మహిళలను వారి గమ్యస్థానాలకు చేర్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్‌ఎం 75 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు, అక్షయ పాత్ర వారు భోజనాలు ఏర్పాటు చేశారు. 
 
కదలని వాహనాలు..
సభ ముగిసే సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో  ప్రాంగణాలు , పార్కింగ్‌ ప్రదేశాలు చిత్తడిగా మారాయి. రాజధాని శంకుస్థాపన ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో జనాలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఇరుక్కుపోయాయి. వందల సంఖ్యలో వాహనాలు ఇరుక్కపోయి అక్కడే ఉండిపోయాయి.
 
సీఎం వచ్చిన ప్రతిసారీ..
గుంటూరు జిల్లాకు ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశాక దాదాపు 30 సార్లు జిల్లాలో సభలు నిర్వహించారు. సభ నిర్వహించిన ప్రతిసారీ మహిళలు, స్కూలు విద్యార్థుల తరలింపు బాధ్యతను అధికారులకు అప్పగించారు. దీంతో సీఎం పర్యటనలంటే జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.  సంబంధం లేని వారిని సభలకు తరలించి, ఇబ్బంది పెడుతున్నామనే భావన వెంటాడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిప్థితి నెలకొంది. సీఎం సభలంటే ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఉన్నతాధికారులు హడలిపోతున్నారు.
 
హడావుడిగా సమీక్ష..
రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన సభలకు వెళ్లిన జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో  జనాల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించారు.
మరిన్ని వార్తలు