ఒక్క ఇంటికే అద్దె అలవెన్స్!

6 Dec, 2015 02:17 IST|Sakshi
ఒక్క ఇంటికే అద్దె అలవెన్స్!

హైదరాబాద్, అమరావతి..రెండుచోట్లా కుదరదన్న సీఎం
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు ఎక్కడైనా ఒకచోట ఇంటికి మాత్రమే అద్దె అలవెన్స్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కొత్త రాజధాని అమరావతి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు హైదరాబాద్, అమరావతి.. రెండుచోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారులు కొందరు అమరావతి, హైదరాబాద్‌లోనూ నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ పరిపాలన శాఖ కొత్త రాజధానిలో కూడా అఖిల భారత సర్వీసు అధికారులకు ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ఫైలును పరిశీలించిన సీఎం.. రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ  ఇటీవల తిరస్కరించారు.

 రూ.500 కోట్ల భారం: అఖిల భారత సర్వీసు అధికారులకు రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తే ఉద్యోగులకూ ఇవ్వాల్సి వస్తుందని, ఇదంతా కలిపి ఏడాదికి అదనంగా రూ.500 కోట్ల భారం పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.  ప్రభుత్వం హైదరాబాద్‌లో వసతి కల్పించినందున అమరావతిలో ఇంటి అద్దె అలవెన్స్‌ను మంజూరు చేయదు.

 ముఖ్యమంత్రికి మాత్రం ఎన్ని చోట్లైనా...
 సీఎంకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఆయనకు హైదరాబాద్‌లో ఇంటికి, లేక్‌వ్యూ అతిథి గృహంలోని క్యాంపు కార్యాలయానికి వేర్వేరుగా అలవెన్స్‌లను సాధారణ పరిపాలన శాఖ చెల్లిస్తోంది. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు, గుంటూరు జిల్లాలోని లింగమనేని ఎస్టేట్‌లో సీఎం ఇంటికి, క్యాంపు ఆఫీస్‌కు వేర్వేరుగా ప్రతినెలా లక్షల్లో అలవెన్స్ మంజూరవుతోంది.

>
మరిన్ని వార్తలు