‘ఓపెన్‌’ అయ్యారు

19 Oct, 2016 00:05 IST|Sakshi
‘ఓపెన్‌’ అయ్యారు
  • వ్యవస్థలో కీలకాంశాలపై అవగాహన కల్పించిన పోలీసు అధికారులు
  • ఆకట్టుకున్న పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌ 
  • ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు l
  • ఆశ్చర్యపరిచిన జాగిలాల విన్యాసాలు
  •  
    ∙పోలీసులు వాడే తుపాకీలను మన సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అవి ఎలా పనిచేస్తాయి? ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి చూసికొట్టొచ్చు? తుపాకీల సామర్థ్యం ఎంత? వాటిలో రకాలెన్ని? ఏయే సమయాల్లో ఏయే తుపాకీలను వాడతారు? 
    ∙వైర్‌లెస్‌ సెట్లను పోలీసు యంత్రాంగం ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తుంది. పోలీసు సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ∙పోలీసు జాగిలాలు దొంగలను ఎలా పసిగడతాయి. నేర పరిశోధనలో వీటి పాత్ర ఏంటి? వీటికి ఏ విధంగా ట్రైనప్‌ చేస్తారు? ∙క్లూస్‌ టీం విధులు? చోరీల గుట్టు ఎలా రట్టు చేస్తుంది?  వేలిముద్ర సేకరణలో ఈ టీం ఎలా వ్యవహరిస్తుంది? 
    ∙డ్రోన్‌ పరికరం విశిష్టత, అది ఎలా పనిచేస్తుంది?  వినియోగం ఎలా? 
     
     
    ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు కాకినాడలోని జిల్లా పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌’ వేదికైంది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ ‘పోలీసుల విధులు –బాధ్యతలు’పై విద్యార్థులతో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై.. పోలీసుల ఆయుధాలు, సమాచార వ్యవస్థ, పోలీసు జాగిలాలు గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. స్వయంగా తుపాకీలను చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరికి ఎస్పీ రవిప్రకాష్‌తోపాటు, ఏస్పీ దామోదర్, ఏఆర్‌ డీఎస్పీ వాసన్, పలువురు సీఐలు, ఎస్సైలు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. 
    – కాకినాడ క్రైం
     
    డ్రోన్‌.. అదిరేన్‌..
    ఓపెన్‌హౌస్‌లో నిఘా, భద్రత కోసం వినియోగించే డ్రోన్‌ పరికరం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్‌ పరికరాన్ని పోలీసులు రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేయగానే ఒక్కసారిగా ఆకాశంలోకి రివ్వున ఎగిరి పెరేడ్‌ గ్రౌండ్‌ అంతా చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. డ్రోన్‌ పరికరంతో అనేక ఫలితాలు సాధించామని, గోదావరి, కృష్ణ పుష్కరాల్లో డ్రోన్‌ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు.
     
    శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులదే కీలకపాత్ర 
    ‘ఓపెన్‌ హౌస్‌’లో ముందుగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలకపాత్రని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. దేశ భద్రత కోసం త్రివిధ దళాలు, బోర్డర్‌ సెక్యూరిటీ కోసం బీఎస్‌ఎఫ్, ఇండో, టిబెట్, సెక్యూరిటీ కోసం సీఐఎస్‌ఎఫ్‌ లాంటి అనేక విభాగాలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా అంతర్గత భద్రత కోసం ఏడాదిలో సుమారు 700 నుంచి 1200 మంది వరకు పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని చెప్పారు. పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా అక్టోబర్‌ 21ను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. జిల్లాలో విద్యార్థులకు పోలీసుల విధులు–బాధ్యతలు, సమాజంలో పోలీసుల పాత్ర వంటి వాటిపై వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్‌  పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు సోషల్‌ మీడియా, వాట్సప్‌ వంటి వాటి కోసం వెంపర్లాడ వద్దని సూచించారు.
     
మరిన్ని వార్తలు