రిమ్స్‌లో మృతి చెందిన మహిళ | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో మృతి చెందిన మహిళ

Published Wed, Oct 19 2016 12:01 AM

రిమ్స్‌లో మృతి చెందిన మహిళ

– మరణించిందని తెలిసినా కన్నెత్తి చూడని బంధువులు
– ఆమె వద్ద ఉన్న బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే రాబందుల్లా వాలిపోయిన వైనం

 
ఆమె బతికి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆమెను ఆదరించలేదు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె మరణించిందని తెలిసినా చివరి చూపు కోసం కూడా రాలేదు. ఆమె దగ్గరున్న సంచిలో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే ఆమె బంధువులం మేమంటే మేమంటూ రాబందుల్లా వాలిపోయారు.
కడప అర్బన్‌:  చింతకొమ్మదిన్నెకు చెందిన చింతల మల్లీశ్వరి భర్త, కుమారుడు మృతి చెందడంతో గత కొంత కాలంగా రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామాంజనేయపురం వికలాంగుల కాలనీలో నివసిస్తోంది. ఆమె ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఓ మహిళను పనిమనిషిగా పెట్టుకుని జీవించేది. ఈనెల 17న ఉదయం 11 గంటల ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతూ ఉంటే అదే ప్రాంతానికి చెందిన పని మనిషి సోదరుడు సుధీర్‌ అనే ఆటో డ్రైవర్‌ ఆమెను తీసుకుని వచ్చి రిమ్స్‌లోని మెడికల్‌ ఐసీయూలో చేర్పించాడు. ఈనెల 18 వ తేదీన మంగళవారం తెల్లవారు జామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది. ఆమె కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ మృత దేహంగా భావించారు. ఈ నేపథ్యంలో ఆమె తన దగ్గర ఉంచుకున్న హ్యాండ్‌ బ్యాగ్‌ను పరిశీలించారు. అందులో సుమారు 17 తులాల బరువు గల 12 బంగారు గాజులు, ఒక చైన్, ఉంగరాలు, వెండి పట్టీలు ఉన్నాయి. అలాగే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారు కొందరు ఆమె బంధువులం తామేనంటూ ముందుకు వచ్చారు. ఆమె కోసం వచ్చిన వారి దగ్గర  నుంచి రిమ్స్‌ ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. వారిలో ఆమెను రిమ్స్‌లో చేర్పించిన సుధీర్‌ అనే ఆటో డ్రైవర్, చింతకొమ్మదిన్నెకు చెందిన మల్లయ్య, పెద్దపోతులూరయ్య, రామాంజులు, గంగులయ్య, యల్లమ్మలు తాము బంధువులమంటే తామ బంధువులమంటూ ఎగబడ్డారు. దీంతో రిమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సంబంధించిన వస్తువులను రిమ్స్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ వెంకట శివకు అప్పగించారు. ఆయన రిమ్స్‌ సీఐకి ఫిర్యాదు చేసి వాటిని అప్పగిస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా రిమ్స్‌ సీఐ మోహన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ తమ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
 
 

Advertisement
Advertisement