హైదరాబాద్‌కు ‘పాలమూరు’ నీళ్లు

28 Jul, 2015 01:01 IST|Sakshi
హైదరాబాద్‌కు ‘పాలమూరు’ నీళ్లు

సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా హైదరాబాద్‌కు మంచినీటిని తీసుకుంటామని, నగరంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీళ్లు అందివ్వడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకువెళతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి సరిపడేంత నీటిని తరలించాలని, హైదరాబాద్‌లో మంచినీటికి కొరత లేదనే మాట రావాలని అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్ నగర ప్రస్తుత, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తీసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహం రూ పొందించాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ మంచినీటి సరఫరా పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో మంత్రి తలసాని, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ‘‘హైదరాబాద్ నగరం, నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు కలుపుకొని, కోటీ 42 లక్షల జనాభా ఉంటుంది.
 
 వీరికి ఏడాదికి 42.58 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. నగర శివారులోని చెరువులు, మంజీరా నుంచి త్వరలో అందే కృష్ణా, గోదావరి నీటిని కూడా కలుపుకొంటే 32 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. మిగతా లోటును భర్తీ చేసుకునేందుకు కృష్ణా, గోదావరి నుంచి నీటిని తరలించాలి. దీని కోసం ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించాలి..’’ అని సమీక్షలో సీఎం సూచించారు. హైదరాబాద్‌లో దాదాపు 9లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని, అన్ని ఇళ్లకు కలిపి హెచ్‌ఎండీఏ పరిధిలో ఇంకా ఎన్ని నల్లా కనెక్షన్లు కావాలో నిర్ధారించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకువచ్చే పైపులైన్ల నిర్మాణం. పంపు హౌజ్‌లు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. మార్గమధ్యంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జాతీయ రహదారుల వద్ద కూడా అనుమతులు త్వరగా రావడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. వెంటనే రైల్వే శాఖ, నేషనల్ హైవేల ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనుమతులు త్వరగా ఇవ్వాలన్న సీఎం వినతికి వారు సానుకూలంగా స్పందించారు. వాటర్‌గ్రిడ్ కోసం రైట్ ఆఫ్ వే చట్టం తెచ్చినట్లుగా గోదావరి, కృష్ణా నదుల నీటికోసం వేసే పైపులైన్‌కు రైట్ ఆఫ్ వే చట్టం తేవాలని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు