తెవా చేతికి అలెర్గాన్ జనరిక్స్! | Sakshi
Sakshi News home page

తెవా చేతికి అలెర్గాన్ జనరిక్స్!

Published Tue, Jul 28 2015 1:01 AM

తెవా చేతికి అలెర్గాన్ జనరిక్స్!

40.5 బిలియన్ డాలర్ల ఒప్పందం
టెల్ అవీవ్/న్యూఢిల్లీ:
ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్‌ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.63 లక్షల కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృసంస్థ అలెర్గాన్ పీఎల్‌సీకి లభిస్తాయి. ఈ డీల్‌కు తెవా, అలెర్గాన్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఆమోదం లభించింది. 2016 తొలి క్వార్టర్‌లో ఒప్పందం పూర్తి కావొచ్చని తెవా పేర్కొంది.

ఒప్పందం ప్రకారం అలెర్గాన్‌కు చెందిన యాక్టావిస్ అంతర్జాతీయ జనరిక్స్ వ్యాపారం, థర్డ్ పార్టీ సప్లయర్ మెడిస్, అంతర్జాతీయ ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) వ్యాపారంతో పాటు కొన్ని ప్రముఖ ఔషధ బ్రాండ్స్ కూడా తెవాకు దక్కుతాయి. ఇటు జనరిక్స్, అటు స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాలను మరింతగా వృద్ధి చేసుకునే దిశగా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెవా ప్రెసిడెంట్ ఎరెజ్ విగోడ్మన్ తెలిపారు. ఇక, మరో ఔషధ దిగ్గజం మైలాన్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు తెవా వెల్లడించింది. మైలాన్‌ను 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు తెవా ఈ  ఏప్రిల్‌లో ప్రతిపాదించడం తెలిసిందే.
 
100 మార్కెట్లలో కార్యకలాపాలు ..
తెవా, అలెర్గాన్ జనరిక్స్ రెండూ కలిస్తే 100 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నట్లవుతుంది. దాదాపు 40 మార్కెట్లలో టాప్ మూడు సంస్థల్లో స్థానం లభిస్తుంది. అలెర్గాన్ కొనుగోలు అనంతరం 2016లో తమ అమ్మకాలు దాదాపు 26 బిలియన్ డాలర్ల మేర ఉండగలవని అంచనా వేస్తున్నట్లు తెవా వర్గాలు తెలిపాయి. తద్వారా అంతర్జాతీయంగా టాప్ 10 ఫార్మా సంస్థల్లో ఒకటిగా ఉండగలమని పేర్కొన్నాయి. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన మూడేళ్ల తర్వాత వార్షికంగా వ్యయాలు, పన్నులు సుమారు 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదా కాగలవని తెవా వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement