పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ హడావుడి

5 Jul, 2013 05:15 IST|Sakshi
 సాక్షి ప్రతినిధి, వరంగల్ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ హడావుడి మొదలైంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ... పల్లెపల్లెనా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలు ఉపకరిస్తాయని పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి.  అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ సంగ్రామానికి ప్రాధాన్యం పెరిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, వరుస వలసలతో డీలా పడ్డ టీడీపీ, తెలంగాణవాదంతో ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, కొత్తగా సత్తా చాటుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు జిల్లాలోని పల్లెలపై ఇప్పటికే కన్నేశాయి.  వరుసగా ఆయా పార్టీల అతిరథ నేతల పర్యటనలతో జిల్లాలో పంచాయతీ రణం ముందుగానే వేడెక్కింది.
 
అందరి కంటే ముందుగా వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పంచాయతీ ఎన్నికల శంఖం పూరిం చారు. హన్మకొండలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన  సదస్సుకు, మరిపెడలో జరిగిన బహిరంగ సభకు భారీగా జనం తరలిరావడంతో ఎన్నికల ముంగిట్లో పల్లెపల్లెనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం  నెలకొం ది. అదే వరుసలో స్థానిక ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన వరంగల్‌లో జరిగే సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. వరుసగా వల సలతో డీలా పడ్డ జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సభపై ఆశలు పెట్టుకున్నారు.
 
మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ఆందోళన మొదలైంది. సీఎం కిరణ్ జిల్లాకు వచ్చేందుకు వెనుకా ముందాడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన పర్యటనలు అర్ధంతరం గా వాయిదా పడ్డాయి. దీంతో జిల్లాలోని ముగ్గు రు మంత్రులు, చీఫ్ విప్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. వీరందరి మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పన్నిన వ్యూహాలు ఫలించినప్పటికీ... ముఖ్య నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు సైతం ఆ పార్టీకి తలనొప్పిగానే మారనున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను చూసేందుకు కాంగ్రెస్ జిల్లా కమిటీ హడావుడిగా డివిజన్‌కో ఇద్దరు కో ఆర్డినేటర్లను నియమించడం గమనార్హం. తెలంగాణవాదాన్ని నమ్ముకున్న టీఆర్‌ఎస్‌కు స్థానిక ఎన్నికలు సవాల్‌గానే మారాయి. సహకార ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోవడంతో... జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ముందునుంచే జాగ్రత్త పడుతోంది.
 
ఇప్పటికే జిల్లా ముఖ్యనేతలతో పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవగా.. కేటీఆర్ సారథ్యంలో స్థానిక ఎన్నికల ఎజెండాగా జిల్లా పార్టీ విసృ్తత సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దింపి మెజారిటీ గ్రామాల్లో పట్టు సాధించాలనే వ్యూహం పన్నుతున్నారు. తెలంగాణ నినాదంతో కొంతకాలంగా ప్రచారంపై దృష్టి సారించిన బీజేపీ ఈసారి పంచాయతీల్లోనూ పట్టు సాధించాలని భావిస్తోంది. త్వరలో రాష్ట్ర స్థాయి నేతల సారథ్యంలో జిల్లా పార్టీ సమావేశం నిర్వహించనుంది. పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. మరోవైపు ముందు నుంచి తమకు పట్టున్న పల్లెలపై సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. అన్ని చోట్ల పోటీ చేయడం కంటే.. తమకు విజయావకాశాలు, పార్టీకి పట్టున్న గ్రామాలు, మండలాలకే పరిమితం కావాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. 
 
మరిన్ని వార్తలు