అభయం.. అందించరూ..!

24 Jan, 2017 21:58 IST|Sakshi
అభయం.. అందించరూ..!

తొమ్మిది నెలల అభయహస్తం పింఛన్లు విడుదల
మరో మూడు నెలల పింఛన్లు పెండింగులోనే..
త్వరగా పంపిణీ చేయాలంటున్న లబ్ధిదారులు
2938 మందికి రూ.1.32 కోట్లు విడుదల


మంచిర్యాల టౌన్‌/నెన్నెల : ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న అభయహస్తం పింఛన్లకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 2,938 మంది లబ్ధిదారులకు రూ.1.32కోట్ల నిధులు వచ్చాయి. 12 నెలల నుంచి పింఛన్లు పెండింగ్‌లో ఉండగా.. సర్కారు ఇటీవలే తొమ్మిది నెలలకు విడుదల చేసింది. మరో మూడు నెలల పింఛన్లు పెండింగ్‌లో పెట్టింది. విడుదలైన పింఛన్లు సైతం పంపిణీ చేయడంతో అధికారులు జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారులు ఆశగా   ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అధికారులను అడిగితే.. ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి అరవై ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్‌ అందజేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గలవారు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చెల్లించాలి. అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా చెల్లించి, 60 ఏళ్లు పూర్తయిన మహిళలకు ఒక్కొక్కరికి ప్రతినెల రూ.500 నుంచి రూ.2,200 వరకు వారి వయస్సును బట్టి బీమా కంపెనీ ద్వారా చెల్లించేటట్లు పథకం రూపకల్పన చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం పింఛన్లకు నిధులు సరిగ్గా ఇవ్వలేదు.

2016 జనవరి నుంచి నిధులు రాని కారణంగా పంపిణీ పింఛన్లు చేయలేకపోయారు. వృద్ధులు మండల కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి వేసారిపోయారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొమ్మిది నెలల అభయహస్తం పింఛన్లు ప్రభుత్వం విడుదల చేయగా, మరో మూడు నెలల పింఛన్లను పెండింగులో ఉంచింది. ఎట్టకేలకు ప్రభుత్వం తొమ్మిది నెలలకు నిధులను మంజూరు చేయడంతో పండుటాకుల మొఖాల్లో సంతోషం కనిపిస్తోంది. ఇదివరకున్న లబ్ధిదారుల్లో కొందరికి ఆసరా పింఛన్లు వస్తుండగా, మరికొంత మంది చనిపోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని డీఆర్‌డీఏ అధికారి వెంకట్‌ పేర్కొన్నారు.

ఎంపీడీవోల బ్యాంకు ఖాతాల్లోకి..
అభయహస్తం పింఛను నిధులను డీఆర్‌డీఏ అధికారులు ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెపుతున్నారు. గడిచిన ఏడాది జనవరి నెల నుంచి సెప్టెంబర్‌ వరకు అభయహస్తం పింఛన్లు ఇస్తామని పేర్కొంటున్నారు. ఒక్కక్కరికి రూ.500 చొప్పున తొమ్మిది నెలలకు రూ.4,500 ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ అధికారి చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

మరిన్ని వార్తలు