హామీల అమలుకు యువతతో ఉద్యమం

29 Jul, 2016 21:55 IST|Sakshi
  • నేడు గుంటూరులో ఉద్యమ కార్యాచరణ
  • వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా 
  • సాక్షి, రాజమహేంద్రవరం : 
    ఎన్నికల్లో యువతకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు వెంటనే వాటిని అమలు చేయాలని కోరుతూ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణ కోసం శనివారం గుంటూరులో యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులకు తెలిపారు. గుంటూరులోని కేకేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 8.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలల నుంచి యువజన విభాగాల అధ్యక్షులు, నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ హామీలు–వైఫల్యాలు, పార్టీ యువజన విభాగం–సంస్థాగత నిర్మాణం అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.  ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనిహామీ ఇచ్చి ఆ ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యను కార్పొరేట్‌ పరం చేసేందుకు చిన్న చిన్న పాఠశాలలు, కాలేజీలపై తనిఖీల పేరుతో ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. తన వియ్యంకుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి నారాయణ కళాశాలల అధినేత, రాష్ట్ర మంత్రి నారాయణ ప్రభుత్వ కళాశాలలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 
     
     
మరిన్ని వార్తలు