పింఛన్లు ఇవ్వడం లేదంటూ సీఎం సభలో నిరసన

8 Jan, 2016 00:33 IST|Sakshi

తిరుపతి కార్పొరేషన్ : అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జన్మభూమి గ్రామసభలో పలువురు వృద్ధులు, వికలాంగులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన జన్మభూమి సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు మీడియా గ్యాలరీ వరకు వచ్చారు. అర్హత ఉన్నా తమకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా రేషన్ కార్డులు కావాలని కొందరు, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని మరికొందరు నిరసన తెలిపారు.

వామపక్ష, కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు
తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని భావించి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సమస్యలు తెలియజేసేందుకు సీపీఎం, సీపీఐ నాయకులు వేర్వేరుగా ర్యాలీ చేపట్టి సీఎం పాల్గొన్నసభకు బయలుదేరారు. వారిని మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా తిరుపతిలో హైకోర్టు ఏర్పాటుచేయాలని మూడు రోజులు కాంగ్రెస్ నాయకులు సంతకాలను సేకరించారు. ఈ నేపథ్యంలో వారు సీఎం సభను అడ్డుకుంటారని భావించి పీసీసీ కార్యదర్శి రుద్రరాజు శ్రీదేవిని ఉదయమే అరెస్టు చేసి చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేశారు.

మరిన్ని వార్తలు