ఆర్‌అండ్‌ఛీ!

11 Jul, 2016 02:53 IST|Sakshi
ఆర్‌అండ్‌ఛీ!

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రహదారులు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) రహదారులంటే వాహనదారులకు వణుకు పుడుతోంది. జిల్లాలో పలుచోట్ల ఈ రోడ్లలో నిర్మాణ పనులు దీర్ఘకాలికంగా సాగుతుండడమే ఇందుకు కారణం. సాధారణంగా ఒక రోడ్డు పని మొదలు పెడితే ఆరు నెలల్లో పూర్తవుతుందని అంచనా ఉంటుంది. కానీ ఆర్‌అండ్‌బీ జిల్లా శాఖ తలపెట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణాలు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ ప్రయాణికుల బాధలు అంతా ఇంతా కావు. రోడ్డు వెడల్పు, డబుల్‌రోడ్డు నిర్మాణం, వంతెనలు.. ఇలా పలు రకాలుగా ఆ శాఖ పనులు నిర్వహిస్తోంది.

నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ల తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్లు వాటిని పూర్తిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గం నుంచే వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ విభాగం ఆరు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో 29 పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగించింది. ఈ పనులకు సంబంధించి వ్యయం రూ. 557.61కోట్లు. ఇంతటి భారీ మొత్తంలో చేపట్టిన పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటివరకు 24 ప నులు మొదలుపెట్టగా.. అందులో కేవలం మూడు మాత్రమే పూర్తయ్యాయి. మరో 5 పనులు ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తిచేసినట్లు చూపిన మూడు రోడ్ల పనులు అత్యంత తక్కువ వ్యయానికి సంబంధించినవి కావడం గమనార్హం,
 
అంతటా నిర్లక్ష్యమే...!
ఆర్‌అండ్‌బీ చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకవైపు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తుండగా.. మరోవైపు పనులు జరిగే చోట కనీస జాగ్రత్తలు పాటించకపోవంతో ప్రయాణికుల యాతన పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచాల వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో కనీసం సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం లేదు. గండిపేట నుంచి శంకర్‌పల్లి రోడ్డు 0/0  కిలోమీటర్ల నుంచి 23/05 వరకు రూ. 75కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో అత్యధిక నిధులు ఈ ప్రాజెక్టుకే కేటాయించగా.. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తికాలేదు.

ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ వైపు రోడ్డు నిర్మాణ పనులు రెండు దశల్లో చేపట్టారు. ఇందుకు రూ. 42కోట్లు కేటాయించారు. కృష్ణా పుష్కరాలు వచ్చేలోపు ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నప్పటికీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో అనుకున్న సమయంలోగా పనులు పూర్తవడంపై సందేహం నెలకొంది. దేవరంపల్లి-శంకర్‌పల్లి రోడ్డులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ రోడ్డుకు రూ.13 కోట్లు మంజూరైనప్పటికీ.. యంత్రాంగం ఉదాసీనతతో పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 7 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ. 140కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు.
 
అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గానికి 6 పనుల నిమిత్తం రూ. 173.5కోట్లు మంజూరు చేయగా.. ఇక్కడ కూడా ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు. హైదరాబాద్‌నుంచి ఎక్కువగా రద్దీ ఉండే ఈ నియోజకవర్గాల్లోని రోడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం వాహనదారులకు నరకం చూపిస్తోంది.

మరిన్ని వార్తలు