విత్తు.. చిత్తు

5 Jul, 2016 02:39 IST|Sakshi
విత్తు.. చిత్తు

వానలు లేక.. విత్తనం మొలకెత్తక..
చేలను దున్నేసుకుంటున్న దైన్యం
దిక్కుతోచని స్థితిలో రైతన్నలు

జిల్లా రైతన్నకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. పంట మొలకెత్తక పోవడంతో దున్నేస్తున్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన బేగరి పోచయ్య, లక్ష్మి దంపతులు. వీరికున్న నాలుగున్నర ఎకరాల్లో 20 రోజుల క్రితం మొక్కజొన్న సాగుచేశారు. అంతరపంటగా కంది విత్తనాలు నాటారు. తొలకరి వర్షాలకు దుక్కిని సిద్ధం చేసుకుని ఆ మరుసటి వర్షాలకే విత్తనాలు నాటినా మొలకెత్తలేదు. తీవ్ర నిరాశకు గురైన ఆ రైతు దంపతులు సోమవారం తమ చేనులో మొలకల్ని ట్రాక్టర్‌తో దున్నేశారు.

దౌల్తాబాద్: విత్తిన విత్తనం మొలకెత్తే ఆశే కనిపించడం లేదు. నిత్యం నింగికేసి చూస్తున్నా అన్నదాతను వరుణుడు కరుణించడం లేదు. చిన్నపాటి జల్లులు మినహా పెద్ద వానలు పడింది లేదు. దీంతో తొలకరి వర్షాలకు విత్తనాలు వేసుకున్న రైతులు కకావికలమవుతున్నారు. విత్తు మొలకెత్తక చిత్తవుతున్నారు. బోలెడు పెట్టుబడితో నాటిన పంట చేలు సరిగా మొలకెత్తకపోవడంతో పంటను చెడిపేసుకుంటున్నారు. మళ్లీ విత్తుతున్నారు. అన్నదాత దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వైనానికి నిదర్శనం ఈ సంఘటన. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన బేగరి పోచయ్య, లక్ష్మీ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం.

వీరికున్న నాలుగున్నర ఎకరాల్లో 20 రోజుల క్రితం మొక్కజొన్న సాగుచేశారు. అంతర పంటగా కంది విత్తనాలు నాటారు. తొలకరి వర్షాలకు దుక్కిని సిద్ధం చేసుకుని ఆ మరుసటి వర్షాలకే విత్తనాలు నాటిన ఆ రైతు కుటుంబానికి నిరాశే మిగిలింది. విత్తు నాటాక చిరు జల్లులు మినహా పెద్దగా వర్షం కురవకపోవడంతో చేలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు. సగానికి పైగా విత్తనాలు మొలవకపోవడంతో మొక్కలు పలుచగా కనిపిస్తున్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ రైతు దంపతులు సోమవారం తమ చేలో మొలకల్ని దున్నేసుకున్నారు. ట్రాక్టరుతో చేలో మొక్కలను దున్నేసి మళ్లీ విత్తునాటేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే రూ.40వేలు ఖర్చయ్యాయి
నాలుగున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశా. మొక్కజొన్న విత్తనాలకు రూ.8వేలు, కంది విత్తనాలకు రూ.5వేలు, ఎరువులకు రూ.6 వేలు, కూలీలకు రూ.3 వేలు, దున్నడానికి రూ.10వేల దాకా ఖర్చయింది. ఇప్పుడు చేను మొలకెత్తక మళ్లీ దున్నేసి విత్తనాలు నాటాలంటే మరో రూ.15వేల దాకా ఖర్చవుతుంది. వర్షాలు సరిగా కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నష్టాల్లో కూరుకుపోతున్నాం. - బేగరి పోచయ్య, రైతు, దొమ్మాట

మరిన్ని వార్తలు