వెంటాడుతున్న వర్షాభావం

17 Sep, 2016 23:38 IST|Sakshi

– 48 మండలాల్లో పరిస్థితి దయనీయం
– దారుణంగా దెబ్బతిన్న వేరుశనగ, ఇతర ఖరీఫ్‌ పంటలు


అనంతపురం అగ్రికల్చర్‌ : మునుపెన్నడూ లేని స్థాయిలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఉపరితల అవర్తనం, అల్పపీడనం ఏర్పడుతున్నా అనుకున్న స్థాయిలో వర్షాలు పడటం లేదు. రోజూ వర్షపాతం నమోదవుతున్నా తేలికపాటి మినహా చెప్పుకోదగ్గ వర్షం కురవడం లేదు. జూన్, జూలైలో మురిపించిన వరుణుడు కీలకమైన ఆగస్టులో మొహం చాటేయడంతో 7.45 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగైన ఖరీఫ్‌ పంటలు దెబ్బతినడంతో ‘అనంత’ రైతులు భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. సెప్టెంబర్‌లో కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 48 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కూడేరు, కంబదూరు, పెద్దవడుగూరు, ఆత్మకూరు, మడకశిర వంటి 15 మండలాల్లో మాత్రమే కాస్త ఎక్కువగానూ సాధారణంగానూ వర్షపాతం నమోదైంది. తక్కిన మండలాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి.  

గుమ్మఘట్టలో మరీ దారుణం : గుమ్మఘట్ట మండలంలో 72 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గుమ్మఘట్టలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ 17వ తేదీ వరకు 226.8 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 63 మి.మీ నమోదైంది. అలాగే బుక్కపట్నంలో 3890.9 మి.మీ గానూ 192 మి.మీ, రాప్తాడులో 272.2 మి.మీ గానూ 138.6 మి.మీ, కదిరిలో 366.7 మి.మీ గానూ 183.8 మి.మీ నమోదైంది. ఈ మూడు మండలాల్లో కూడా సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.

నల్లచెరువు 49 శాతం, రామగిరి 45 శాతం, తనకల్లు 42 శాతం, బొమ్మనహాల్‌ 40 శాతం, అమరాపురం 39 శాతం, కనగానపల్లి 37 శాతం, బెళుగుప్ప 37 శాతం, పుట్టపర్తి 36 శాతం, రొళ్ల, చిలమత్తూరు, గాండ్లపెంటలో 35 శాతం, అమడగూరు 32 శాతం, హిందూపురంలో 31 శాతం మేర తక్కువ వర్షపాతం కురిసింది. యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, శింగనమల, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, బత్తలపల్లి, ముదిగుబ్బ, ఎన్‌పీ కుంట, ఓడీ చెరువు, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, పరిగి, నల్లమాడ, తలుపుల, విడపనకల్, వజ్రకరూరు, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, కుందుర్పి, యల్లనూరు తదితర మండలాల్లో కూడా తక్కువగా వర్షాలు కురిశాయి.  

45 రోజుల తర్వాత అగళిలో చినుకులు : ఆగస్టు నెలలో అగళి, రొళ్ల మండలాల్లో చినుకు జాడ లేదు. ఈ రెండు మండలాల్లో సున్నా వర్షపాతం నమోదు కావడం విశేషం. చివరకు సెప్టెంబర్‌ 7న రొళ్లలో 8 మి.మీ వర్షపాతం కురవగా అగళిలో ఈనెల 15న అంటే సరిగ్గా 45 రోజుల తర్వాత 16 మి.మీ మేర తేలికపాటి వర్షం పడింది. ఇలా నెలల తరబడి చినుకులు నేలకు పడకపోవడంతో పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కీలకమైన ఆగస్టులో 32 మండలాల్లో కనీసం 10 మి.మీ వర్షం పడిన దాఖలాలు లేవు. కేవలం ఒకట్రెండు సార్లు తుంపర వర్షం పడింది. మిగతా 31 మండలాల్లో ఒకట్రెండు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఆగస్టు నెలలో 88.7 మి.మీ గానూ కేవలం 18.1 మి.మీ నమోదైంది. అంటే కురవాల్సిన వర్షం కన్నా 80 శాతం తక్కువగా పడటం గమనార్హం. ఇక సెప్టెంబర్‌లో భారీ వర్షాలు పడాల్సివుండగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

అక్కడక్కడా తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. ఈనెలలో 118.4 మి.మీ భారీ సగటు నమోదు కావాల్సి ఉండగా 17 రోజులైనా 18.9 మి.మీ నమోదైంది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 47 శాతం ఎక్కువగా 94.5 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ 52 శాతం అధికంగా 102.8 మి.మీ నమోదు కావడంతో ఆగస్టు, సెప్టెంబర్‌ వర్షాభావం అంతగా కనిపించని పరిస్థితి నెలకొంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 278.4 మి.మీ గానూ 234.3 మి.మీ నమోదైంది. అంటే 16 శాతం మాత్రమే లోటు కనిపిస్తోంది. పంటల సాగుకు వీలుగా జూన్, జూలైలో మంచి వర్షాలు పడటంతో ఈ సారి ఏకంగా 7.45 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో ప్రధానమైన వేరుశనగ 6.09 లక్షల హెక్టార్లలో సాగైంది. ఆగస్టు, సెప్టెంబర్‌ వర్షాలు మొహం చాటేయడంతో వేరుశనగతో పాటు ఇతర పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది.

మరిన్ని వార్తలు