సిరిసిల్ల కేంద్రంగా రాజాద్రి జిల్లా

9 Jun, 2016 19:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలని తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ రాజన్న జిల్లా (రాజాద్రి) అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కలెక్టర్ నీతూప్రసాద్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జగిత్యాల జిల్లాలతోపాటు సిరిసిల్లను జిల్లా చేయాలని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన అభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈనెల 7,8 తేదీల్లో హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై చర్చించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలు ప్రధాన ఆలయాలుగా ఉన్నాయి. వీటిలో భద్రాద్రి, యాదాద్రి పేరిట కొత్త జిల్లాలు అవతరించబోతున్నందున వేములవాడ రాజన్న పేరుతో సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాలను కలుపుతూ కొత్తగా రాజాద్రి జిల్లా ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీఎం ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసీఆర్ సూచనలతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు