పెద్దాసుపత్రిలో అరుదైన గుండె శస్త్ర చికిత్స

3 Oct, 2016 22:53 IST|Sakshi
పెద్దాసుపత్రిలో అరుదైన గుండె శస్త్ర చికిత్స
– మూడించుల గాటుతో గుండె ఆపరేషన్‌
– ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి
 
కర్నూలు(హాస్పిటల్‌): పెద్దాసుపత్రిలో  ప్రాంతీయ కార్డియోథొరాసిక్‌ సర్జరీ సెంటర్‌ మరోసారి ఘనత సాధించింది. ఇక్కడి వైద్యులు అరుదైన గుండె ఆపరేషన్‌ చేసి రికార్డు సృష్టించారు. పెళ్లి కావాల్సిన ఓ యువతికి పెద్దగాటు పెట్టకుండా మూడించుల గాటుతో గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్‌ చేయడం మొదటిసారని వైద్యులు ప్రకటించారు. దీంతో పాటు ఓ గిరిజన బాలికకు సైతం ఓపెన్‌హార్ట్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. వివరాలను సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి సమక్షంలో కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రభాకరరెడ్డి వివరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన సాయిప్రియ(16) హద్రోగ సమస్యతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందన్నారు. ఆమెకు  మినిమల్లీ ఇన్‌వేసివ్‌ కార్డియాక్‌ సర్జరీని ఆదివారం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సాధారణంగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అంటే గొంతు కింద నుంచి కడుపు వరకు పెద్దగా కోసి చేస్తారని, కానీ సాయిప్రియకు పెళ్లి కావాల్సి ఉండటంతో గాటు కనిపించకుండా ఛాతీ కింద భాగంలో మూడించుల గాటు పెట్టి ఆపరేషన్‌ చేశామన్నారు. అలాగే ఆత్మకూరు మండలం పాలెంచెరువు గ్రామానికి చెందిన భారతమ్మ(13) అనే బాలిక జన్మతః గుండెకు రంధ్రం ఏర్పడి బాధపడుతుండటంతో ఆమెకు సైతం ఓపెన్‌హార్ట్‌ సర్జరీ ఆపరేషన్‌ చేశామన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి శనివారం రూ.4లక్షల విలువైన పరికరాలు వచ్చాయన్నారు. దీంతో ఆదివారం ఆపరేషన్‌ చేయడానికి వీలు కలిగిందని ఆయన తెలిపారు. ఈ ఇద్దరికీ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ నిర్వహించామన్నారు. సాయిప్రియకు చేసిన ఆపరేషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి నిర్వహించామన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ రెండు, మూడుచోట్ల మాత్రమే ఇలాంటి సర్జరీ చేశారని తెలిపారు. బెంగళూరులో అయితే రూ.3లక్షలకు పైగా ఈ సర్జరీకి వసూలు చేస్తారని వివరించారు. వచ్చే ఆదివారం డబుల్‌ వాల్యు రీప్లేస్‌మెంట్‌ సర్జరీలు చేయనున్నట్లు తెలిపారు.
 
పారామెడికల్‌ సిబ్బంది లేకపోవడమే సమస్య
ప్రాంతీయ కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగానికి పారామెడికల్‌ సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా నియమించుకోవాలని డీఎంఈ లేఖ పంపించారన్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ పోస్టుల నియామకానికి త్వరగా ఉత్తర్వులు ఇస్తే రోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ నుంచి ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫర్ఫూజనిస్ట్‌లను పిలిపించి ఆపరేషన్‌ చేస్తున్నామన్నారు. ఇక్కడే సిబ్బంది నియమిస్తే వారానికి మూడు, నాలుగురోజులు ఆపరేషన్లు చేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డబ్లు్య. సీతారామ్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్, అనెస్తీషియా వైద్యులు డాక్టర్‌ కైలాష్‌నాథ్‌రెడ్డి, డాక్టర్‌ కొండారెడ్డి, కర్నూలు మెడికల్‌ కాలేజి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు