మూసేయండి

28 May, 2017 01:03 IST|Sakshi
ఆకివీడు : ప్రాథమిక పాఠశాలల్ని మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట మూడేళ్లుగా బడులను మూసివేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాదీ అదే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 70కి పైగా ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బడుల మూతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 19 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిస్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. జెడ్పీ హైసూ్కళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారుస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40లోపు విద్యార్థులు ఉంటే.. వాటిని కూడా ప్రాథమిక పాఠశాల స్థాయికి తగ్గిస్తారు. జిల్లాలో 2,250 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. వాటిలో 70కి పైగా బడులను మూసివేస్తారని తెలుస్తోంది. ఇవి కాకుండా 50 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిని కుదించే అవకాశం ఉన్నట్టు అంచనా.
 
ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా..
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 2016 డిసెంబర్‌ 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు. 21 నుంచి 60 లోపు పిల్లలుంటే ఇద్దర్లు, 60 మంది దాటితే ముగ్గురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి దానిని మోడల్‌ పాఠశాలగా గుర్తిస్తారు. 80 నుంచి 131 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఒక ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. ఈ మేరకు జీవో–29 జారీ కాగా.. దానికి అనుబంధంగా ఆర్‌సీ నంబర్‌ 4102తో మార్గదర్శకాలు సైతం వెలువడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలను ఈనెల 30న విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సదరు నివేదికల తుది పరిశీలన అనంతరం ఆయా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను జూన్‌ 1న అధికారికంగా ప్రకటిస్తారు.
 
బలోపేతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తెచ్చాక విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ స్థాయి నుంచి తరగతులు ఉండాలి. పాఠశాలలు మూసివేయడమనేది అవివేక చర్య. విద్య ఉమ్మడి వ్యవస్థగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకూడదు. దీనిని వ్యతిరేకిస్తున్నాం.
–  కె.రామలింగరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు, ఆకివీడు మండలం
 
పాఠశాలల్ని కుదించడం దారుణం
విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో ప్రభుత్వ పాఠశాలల్ని కుదించడం దారుణం. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 27వ స్థానంలో ఉంది. ఈ చర్యల వల్ల మరింత దిగజారుతుంది. నిరుపేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలల కుదింపు, ఎత్తివేత వంటి చర్యల్ని వెంటనే మానుకోవాలి.
– పిల్లి జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్‌ జిల్లా శాఖ 
 
>
మరిన్ని వార్తలు