మనుషుల్లో దేవుడు

24 May, 2017 23:31 IST|Sakshi
మనుషుల్లో దేవుడు

చేతిలో ఓ గొడుగు... ఎవరూ వెంట రాకపోయినా ఒంటరిగా వెళుతున్న స్పెయిన్‌కు చెందిన ఆ వ్యక్తిని చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. కనిపించిన అందరినీ అప్యాయంగా పలకరిస్తూ.. తన స్పర్శ ద్వారా ప్రేమతత్వాన్ని పంచుతున్న ఆయన పట్ల ప్రజల్లో రానురాను భక్తి భావం పెరిగింది. ఏ ప్రాంతానికి వెళ్లిన చిన్న పిల్లలకు చాక్లెట్లు అందిస్తూ వారితో సన్నిహితంగా మెలిగిన ఆయనే ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌. క్రైస్తవ మిషనరీలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయన.. ఏనాడూ ప్రజల్లో మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు మాట్లాడేవారు కారు. బహిరంగంగా తన ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు కూడా ఇష్టపడని ఆయన 1920 ఏప్రిల్‌ 9న స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు.

తన యుక్త వయసులో స్పానిష్‌ సైన్యంలో చేరి దేశానికి సేవ చేశారు. క్రిస్టియన్‌ మిషనరీని ఏర్పాటు చేసేందుకు 1952లో భారతదేశంలో అడుగు పెట్టిన ఆయన ఎన్నో చేదు అనుభవనాలను ఎదుర్కొన్నారు.ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితురాలైన నాటి ప్రముఖ పాత్రికేయురాలు అన్నే..  ఆయన వెన్నంటి నడిచారు. అప్పటి ఆంధ్రరాష్ట ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయనను అనంత కరువు కదిలించింది. 1969లో జిల్లా కేంద్రం అనంతపురానికి చేరుకున్న ఫెర్రర్‌కు ఎమ్మా బిల్డింగ్‌లో వసతి కల్పించారు.

దానినే కార్యాలయంగా మార్చుకుని జిల్లాలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన అన్నేను వివాహమాడారు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. చిన్నపిల్లలకు బలవర్ధక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. తాము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ప్రజల మనిషిగా నిలిచిపోయారు. 2009లో జనవరి 8న ఆయన మహానిష్ర్కమణ అనంతరం ఆయన ఆశయసాధనలో ఆర్డీటీ సంస్థ ముందుకెళుతోంది.
- అనంతపురం సప్తగిరి సర్కిల్‌

మరిన్ని వార్తలు