‘పదివేలు కాదు..1.90 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి’

26 Jul, 2016 19:50 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1.90 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే కేవలం పది వేల పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ‘అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన తర్వాత కూడా ఇంత తక్కువ పోస్టులను భర్తీ చేయడం సరికాదు.

 

ఖాళీలున్న మొత్తం లక్షా 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేస్తూ ఆర్. కృష్ణయ్య మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. గడిచిన 25 నెలల్లో ప్రభుత్వ పరంగా ఒక గ్రూప్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడాన్ని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న కారణంగా సిబ్బంది కొరతతో ఫైళ్లు కదలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

 

ఉదాహరణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలలో ఒక్కొక్క వార్డెన్ మూడు నాలుగు హాస్టళ్లకు ఇంచార్జీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక వార్డెన్ ఒక హాస్టల్‌ను నిర్వహించడమే కష్టమని, అలాంటిది నాలుగు హాస్టళ్లను ఎలా పర్యవేక్షించగలరని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భతి చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. శాఖల వారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను లెక్కగట్టేందుకు డెరైక్టు ఐఏఎస్ అధికారితో ఒక కమిటీ ఏర్పాటు చేసి, లోతుగా పరిశీలించి ఖాళీలను గుర్తించడంతో పాటు వాటిని త్వరితగతిన భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి సూచించారు.
 

>
మరిన్ని వార్తలు