15 మంది స్మగ్లర్లు అరెస్ట్‌

24 Jan, 2017 22:15 IST|Sakshi
15 మంది స్మగ్లర్లు అరెస్ట్‌

13 ఎర్రచందనం దుంగలు స్వాదీనం
ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ జింకల శ్రీలక్ష్మి తెలిపారు. ఖాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖాజీపేట మండలం లోని లంకమల్ల అడవుల్లోకి తమిళ స్మగ్లర్లు, మరికొందరు స్థానిక స్మగ్లర్లు దొంగచాటుగా ప్రవేశించి ఎర్రచందనాన్ని నరికి తీసుకు వచ్చి స్మగ్లింగ్‌ చేసేవారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. చెన్నముక్కపల్లె తెలుగుగంగ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 15 మంది స్మగ్లర్లతో పాటు 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
అరెస్టయిన స్మగ్లర్లు వీరే..
1.ఆకుల జయరాముడు, 2. ఆకుమల్ల పెద్దరాముడు, 3.మద్దెల కిరణ్‌ 4. మద్దెల రజనీకాంత్, 5. మద్దెల చెప్పలయ్య, 6. మెల్ల జయరాముడు (చెన్నముక్కపల్లె) 7. తవ్వా స్వామి కొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 8. మధుర దొరబాబు (చెన్నముక్కపల్లె) 9. ఆకుమల్ల సుధాకర్‌ (చెన్నముక్కపల్లె) 10. తవ్వా బాలకొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 11. ఆకులమల్ల రామ్‌బాబు (చెన్నముక్కపల్లె) 12. మెల్ల రఘురాం (చెన్నముక్కపల్లె) 13. మల్లె బాబు (చెన్నముక్కపల్లె) 14. అబ్బిరెడ్డి ఓబుళరెడ్డి 15. పొట్టి ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
పోలీస్, అటవీ అధికారులుగా బెదిరింపులు
ఇక్కడి అడవుల్లో తమిళ కూలీల రాక పోకలు అధికంగా ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. దీనిని గుర్తించి స్థానిక స్మగ్లర్లు తాము అటవీ, పోలీసు అధికారులమని తమిళ కూలీలను బెదిరించి వారిపై దాడులు చేసేవారన్నారు. తమిళ కూలీలు వదిలిన 15 దంగలను తీసుకుని దువ్వూరు, చెన్నూరు, పెండ్లిమర్రి కి చెందిన వ్యక్తులకు అమ్మి రూ.2లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలిపారు. తమిళ కూలీల కదలిక పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.  ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారు ఎంతటివారైనా సహించేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు