Sakshi News home page

మాఘమాసం ముంచుకొస్తుంది

Published Tue, Jan 24 2017 10:15 PM

మాఘమాసం ముంచుకొస్తుంది

  • 28 నుంచి ప్రారంభం
  • రత్నగిరిపై భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
  • దేవస్థానం అధికారులు, పండితుల సమావేశంలో నిర్ణయం
  • ఫిబ్రవరి మూడో తేదీన రథసప్తమి, ఏడున భీష్మ ఏకాదశి
  • 11న మాఘపౌర్ణిమ, 22న బహుళ ఏకాదశి
  • అన్నవరం :
    పవిత్ర మాఘమాసం ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతుండడంతో సత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ఫిబ్రవరి ఏడో తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్బంగా సత్యదేవుని దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
    మాఘమాస ఏర్పాట్లపై చర్చించేందుకు దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం దేవస్థానం అధికారులతో సమావేశమయ్యారు. మాఘమాసంలో జరిగే వివాహాలకు హాజరయ్యే వారి కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిపారు. సమావేశంలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, వేదపండితులు, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ,  ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్‌ వ్రతపురోహిత సూపర్‌వైజర్లు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఆలయ సూపరింటెండెంట్‌ కే కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
    మాఘమాసంలో వచ్చే పర్వదినాలు...దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు
    ఫిబ్రవరి మూడో తేదీ రథసప్తమి రోజు న ఉదయం తొమ్మిది గంటలకు కొండదిగువన పవర్‌హౌస్‌ వద్ద సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు.
    · ఏడో తేదీ భీష్మ ఏకాదశి రోజున సత్యదేవుని సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు సత్యదేవుని సుప్రభాతసేవ, 2 : 30 గంటలకు వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెండి పల్లకీపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. రాత్రి ఏడు గంటల నుంచి కొండదిగువన గరుడ వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు.
    · పదో తేదీ మాఘపౌర్ణమి రోజున తెల్లవారు నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఆరోజు శుక్రవారం పర్వదినం కావడంతో శ్రీవనదుర్గ ఆలయంలో చండీ హోమం, పౌర్ణమి కావడంతో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు.
    · 22న బహుళ ఏకాదశి రోజు తెల్లవారుజామున  నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆలయప్రాంగణం చుట్టూ వెండి రథంపై సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగిస్తారు. రాత్రికి గ్రామంలో సత్యదేవుడు, అమ్మవార్లను పల్లకీలో ఊరేగిస్తారు. 
     

Advertisement
Advertisement