ఉనికి కోల్పోతున్న రేగోడ్‌ మండలం

8 Oct, 2016 18:02 IST|Sakshi
దీక్షలు చేస్తున్న ప్రజలు

మండలంపై ప్రభుత్వం కక్షసాధింపు
నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన
మండలానికి ఉండాల్సిన జనాభా 35 వేలు
ప్రస్తుతం 22 వేలే..
న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రజానీకం

రేగోడ్‌: ఏ ప్రభుత్వమైనా పాలనాపరంగా పారదర్శకంగా... నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆంధ్రోళ్లు, నీళ్లను... ఉద్యోగాలను దోచేసుకుంటున్నారని.. మన తెలంగాణ మనకు వస్తే సమస్యలేమీ ఉండవని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ 14 సంవత్సరాలుగా ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని ఉద్యమాలు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.

బంగారు తెలంగాణలో బంగారు భవిషత్‌ ఉంటుందని కలలుగన్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. జిల్లాలు.. మండలాల పునర్విభజనలో తెలంగాణ సర్కారు తీరుపై మండలానికి తీరని అన్యాయం జరిగిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన చేశారని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటనికి సిద్ధమవుతున్నారు రేగోడ్‌ మండల ప్రజలు.

దివంగత సీఎం ఎన్టీఆర్‌ 1985 సంవత్సరంలో మండలాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేవునూరు రెవెన్యూ సర్కిల్‌గా ఉండేది. సర్కిల్‌గా ఉన్న దేవునూరు గ్రామాన్ని మండల కేంద్రం హోదా కల్పించాలని అప్పట్లో స్థానికులు ఒత్తిడి తెచ్చారు. రేగోడ్‌ గ్రామానికి చెందిన కల్లేటి రాజేశ్వర్‌ గుప్తా తనకున్న పలుకుబడితో దేవునూరు కాకుండా రేగోడ్‌ను మండల కేంద్రం చేయించారు. రేగోడ్‌ మండలంలో 19 గ్రామ పంచాతీలున్నాయి.

ఇందులో ఇప్పటి వరకు 25 గ్రామాలు, 36,167 జనాభా ఉంది. రేగోడ్‌ మండలం ఏర్పాటు కావడంతో ఖాదిరాబాద్, ఉసిరికపల్లి, నిర్జప్ల, సాయిపేట, దరఖాస్తుపల్లి, దేవునూరు, మేడికుంద పంచాయతీల ప్రజలు 30 కిలో మీటర్లు రేగోడ్‌ మండలానికి రావాలంటే గత 30 సంవ్సరాలకుపైగా ఇబ్బందులు పడ్డారు.

వట్‌పల్లిలో ఏడు పంచాయతీలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్విభజనలో నూతనంగా అల్లాదుర్గం మండలంలోని వట్‌పల్లిని మండల కేంద్రం చేశారు. రేగోడ్‌ మండలంలోని దేవునూరు గ్రామ పంచాయతీలో 3,592 జనాభా, ఉసిరికపల్లిలో 1,482 జనాభా, నిర్జప్లలో 1,017 జనాభా,  మేడికుందలో 1,604 జనాభా, దుద్యాలలో 1,733 జనాభా, ఖాదిరాబాద్‌లో 3,313 జనాభా, సాయిపేటలో 893 జనాభా ఉంది. ఈ గ్రామాలు వట్‌పల్లి మండలంలో విలీనం కానున్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో  మొత్తం 13,634 జనాభా మాత్రమే ఉంది.

రేగోడ్‌కు మిగిలింది 22 వేల జనాభా
ప్రస్తుతమున్న రేగోడ్‌ మండలంలోని రేగోడ్‌లో 3,732 జనాభా, చౌదర్‌పల్లిలో 1,473 జనాభా, మర్పల్లిలో 2,338 జనాభా, కొత్వాన్‌పల్లిలో 1,471 జనాభా, జగిర్యాలలో 1,020 జనాభా, ఆర్‌.ఇటిక్యాలలో 1,529 జనాభా, దోసపల్లిలో 2,251 జనాభా, కొండాపురంలో 1,727 జనాభా, ప్యారారంలో 1,077 జనాభా, టి.లింగంపల్లిలో 1,412 జనాభా, సిందోల్‌లో 2,200 జనాభా, గజ్వాడలో 2,303 జనాభా ఉంది. 22,533 జనాభా మాత్రమే మిగలనుంది.

పూర్తిస్థాయి రేగోడ్‌ మండలం 156 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం 81 చదరపు కిలో మీటర్లు మాత్రమే ఉండబోతోంది. రేగోడ్‌ మండలాన్ని నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌లో కలపాలని ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి రెండువేల మంది ప్రజానీకం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. రేగోడ్‌ మండలానికి జరిగిన అన్యాయంపై ఇక్కడి ప్రజలు.. ప్రజాప్రనిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

బాబూమోహన్‌ ఉప ఎన్నికలో రేగోడ్‌కు కేసీఆర్‌
అందోల్‌ నియోజకవర్గానికి 1998లో ఉప ఎన్నిక జరిగింది. హాస్యనటుడు బాబూమోహన్‌ను అందోల్‌ ఎమ్యెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉప ఎన్నికలో ప్రచారం నిమిత్తం రేగోడ్‌ మండలానికి వచ్చారు. రేగోడ్‌ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉండగానే రేగోడ్‌ మండలం తన అస్తిత్వాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేగోడ్‌ మండలం నుంచి వట్‌పల్లిలో పలు గ్రామాలను కలపడాన్ని ఇక్కడి ప్రజలు తప్పుబట్టడం లేదు. 35 వేల జనాభాకంటే తక్కువగా 22 వేలు ఉంచడం... నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌లో రేగోడ్‌ మండలాన్ని ఉంచాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాభిప్రాయాలను పరిగణణలోకి తీసుకుంటామని ఓ పక్కన సీఎం పదేపదే చెబుతున్నా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా విభజన చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఇష్టానుసారంగా మండలానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి పోకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఐదు గ్రామాలను అందోల్‌ కలిపిన దామోదర
రేగోడ్‌ మండలంలో గతంలో ఆరు గ్రామాలు, మూడు తండాలు మెదక్‌ నియోజకవర్గంలో ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం 2009లో అప్పటి మంత్రి దామోదర రాజనర్సింహ ఆ గ్రామాలు, తండాలను అందోల్‌ నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యమంటూ పునర్విభజన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ను కాదని 65 కిలోమీటర్ల దూరంలోని మెదక్‌లో రేగోడ్‌ మండలాన్ని కలపడం ఎంత వరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మీ కోన్యాయం.. మా కోన్యాయమా..?
ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజలు, మేధావులు, యువకులు, అన్ని కుల సంఘాలు, ఉద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తమ ప్రాంతం తమకు కావాలని టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు ఎలా ఆందోళనలు చేశారో? రేగోడ్‌ మండల ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌లో తమను చేర్చాలని ఆందోళనలు చేశారు.

అందోల్‌ ఎమ్యెల్యే బాబూమోహన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలు చేసినందుకే పాలకులు మండలాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మెదక్‌లోనే ఉంచడం.. మండలంలో 35 వేలకంటే తక్కువ 22 వేల జనాభాకే పరిమితం చేయడంపై ప్రజలు.. ఆయా పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీరు ఉద్యమం చేస్తే న్యాయం.. మేం ఉద్యమం చేస్తే వ్యతిరేకమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీర్‌, మంత్రి హరీశ్‌రావు స్పందించి రేగోడ్‌ మండలానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు