ఘనంగా ముత్యాలమ్మ జాతర

28 Aug, 2016 20:18 IST|Sakshi
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్‌నగర్‌ : పట్టణంలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో రెండు రోజుల పాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పోచమ్మ చెరువు సమీపంలోని పెద్ద ముత్యాలమ్మ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించిన అనంతరం మెుక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద వాసవీ, వనితాక్లబ్‌ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీరు సరఫరా చే శారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణంలో భారీగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి, బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణలు చేయగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా నగరపంచాయతీ చైర్మన్‌ జక్కుల వెంకయ్య, వైస్‌చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. జాతరలో రెండోరోజైన సోమవారం చిన్న ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లిస్తారని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.
పటిష్ట  బందోబస్తు
 ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్‌నగర్‌ సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడమే గాక పెద్ద ముత్యాలమ్మ ఆలయం వద్దకు వెళ్లే రహదారులను వన్‌వేగా మార్చారు. ప్రభ బండ్ల ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
 
 
 
మరిన్ని వార్తలు