దొంగలు దొరికారు

1 Oct, 2016 22:11 IST|Sakshi
దొంగలు దొరికారు
– దేవాలయాలు లూటీ చేసిన దొంగల ముఠా అరెస్ట్‌ 
– రూ.1.70 లక్షలు విలువ చేసే సొమ్ము, రూ.31 వేల నగదు, ఆటో స్వాధీనం
– 16 కేసుల్లో పది మంది జైలుకు
– నిందితుల్లో ఒకరు పూజారి
  
రెండు నెలలుగా పోలీసులకు సవాల్‌ విసురుతూ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ఎట్టకేలకు దొరికింది. హుండీలు ఎత్తుకెళ్లడం, స్వామి అమ్మవార్ల ఆభరణాలు అపహరించడం.. భక్తులు సమర్పించిన సామగ్రిని మాయం చేయడం ఈ ముఠా చేతివాటం. దాదాపు 16 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. గుళ్లకు కన్నం వేసే పది మంది ముఠా సభ్యులకు ఓ పూజారి ముఠా పెద్ద కావడం విశేషం. నంద్యాల పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు. 
– కర్నూలు
  
దేవుడి సొమ్ము అపహరిస్తూ.. దర్జాగా తప్పించుకు తిరుగుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది. వరుస చోరీలతో పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ అప్రమత్తం చేసి దేవాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు దీబగుంట్ల వీరభద్రస్వామి దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారం మేరకు బొమ్మలసత్రం వద్ద ఉన్న ఐటీసీ పొగాకు కంపెనీ పక్కనున్న కంప చెట్లలో నిందితులందరూ కలసి దొంగలించిన హుండీ డబ్బులు, వెండి, బంగారం, ఇత్తడి సామాన్లు పంచుకుంటుండగా పోలీసులు మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు వారు విచారణలో అంగీకరించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.70 లక్షలు విలువ చేసే సొమ్ములను స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 
  
దేవుడి సేవ మానేసి.. గుళ్లకు కన్నం వేస్తూ.. 
మహానంది మండలం పిన్నాపురం గ్రామానికి చెందిన మనోహర్‌ గ్రామంలోని మద్దిలేటి స్వామి ఆలయంలో పూజారి. భక్తులు ఇచ్చే కానుకలతో సంతృప్తి చెందక.. చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. బేతంచెర్ల, గిద్దలూరు, బనగానపల్లె, అర్దవీడు, గుడివాడ(కృష్ణా జిల్లా), గడివేముల, బండి ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన సాకి వెంకటనారాయణ, నరమేకల గుణమద్దిలేటి, దాసరి నాగరాజు, వెంకటగిరి అశోక్, టెల్లకుల మధుసుధాకర్, జకాటి శైలజ, కాటిపోగు జయపాలు అలియాస్‌ చిన్న, కుందనం శ్రీకాంత్‌రెడ్డి, వీరశెట్టి వెంకటేశ్వర్లు తదితరులను ముఠాగా ఏర్పాటు చేశాడు.  రాత్రివేళల్లో ఆటోల్లో తిరుగుతూ నంద్యాల, సంజామల, ఆళ్లగడ్డ, వెల్దుర్తి, బనగానపల్లె, శిరివెళ్ల, చాగలమర్రి, కోవెలకుంట్ల, గోస్పాడు, డోన్‌ ప్రాంతాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.1.70 లక్షలు విలువ చేసే హుండీ డబ్బులు, దేవుళ్ల బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, పూజా సామగ్రిని దొంగలించినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. బంగారు, వెండి, ఇత్తడి పూజా సామగ్రి వస్తువులతో పాటు రూ.31 వేల నగదు, నేరానికి ఉపయోగించిన ఏపీ27 వై1278 ఆటోను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తును వేగవంతం చేసి దొంగలను అరెస్టు చేసి సొమ్ములు రికవరీ చేసినందుకు నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, త్రీటౌన్‌ ఎస్‌ఐలు సూర్యమౌళి, హనుమంతురెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్, కానిస్టేబుల్‌ కష్ణ తదితరులను ఎస్పీ అభినందించారు.
 
దేవాలయాల వద్ద నిఘాను విస్తతం చేస్తాం : ఎస్పీ
జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పోలీసు నిఘాను మరింత విస్తతం చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఆలయాల వద్ద భద్రత లోపం లేకుండా ఆలయ కమిటీలు సమన్వయంతో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంత డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఈ మేరకు చర్యలు తీసుకుని గస్తీలు పెంచి నేరాలను నియంత్రించాలని ఆదేశించారు. ప్రముఖ దేవాలయాల వద్ద ఇకపై బీట్‌ పుస్తకాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడే గ్యాంగ్‌లపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఎక్కడ అనుమానితులు కనిపించినా డయల్‌ 100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు కానిస్టేబుళ్లకు ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు.    
 
మరిన్ని వార్తలు