మత బోధకుని ముసుగులో..

6 Aug, 2016 11:22 IST|Sakshi
మత బోధకుని ముసుగులో..
నిడదవోలు: క్రైస్తవ మత బోధకుని ముసుగులో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని నిడదవోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎం.బాలకృష్ణ ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు.  ఆయన కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన జయవరపు కృష్ణ క్రై స్తవ మత బోధకునిగా చెప్పుకుంటూ ప్రార్థనలు చేస్తానని ఊరూరా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఈనెల 3న ఉదయం నిడదవోలు పట్టణంలో గాంధీనర్‌ మునిసిపల్‌ పార్క్‌ సమీపంలో ఉన్న కాకి సూర్యారావు ఇంటికి వెళ్లాడు. అక్కడ అతని భార్య అచ్చియమ్మ పక్షవాతంతో బాధపడుతుండటం గమనించి ఆమె స్వస్థతకు ప్రార్థనలు చేస్తానని చెప్పాడు.
 
ఆ సమయంలో ఆ భర్త బయటకు వెళ్లడంతో  ఇదే అదునుగా భావించిన బోధకుడు ప్రార్థనకు మెడలో ఉన్న మంగళసూత్రాలు అడ్డు అని చెప్పి వాటిని తీయించి పక్కనే ఉన్న టీపాయి మీద పెట్టించాడు. ఆమెను కళ్లుమూసుకోమని చెప్పి మంగళ సూత్రాలు తీసుకుని పరారయ్యాడు. ఆమె కళ్లు తెరిచి చూసేటప్పటికి బోధకునితోపాటు మంగళసూత్రాలు కనిపించకపోవడంతో  లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం నిందితుడిని మండలంలోని శెట్టిపేట వద్ద అరెస్ట్‌ చేసి అతని వద్ద నుండి మూడున్నర కాసుల మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ  బాలకష్ణ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్సై భగవాన్‌ ప్రసాద్, సిబ్బంది ఎండి షరీప్, ప్రభాకరరావు, అనిల్, టి.శ్రీనివాసరావు, ఎల్‌.బాబురావు, రామారావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు