కళ్లల్లో కళ్లు పెట్టి చూడు...

11 Jun, 2016 12:49 IST|Sakshi
కళ్లల్లో కళ్లు పెట్టి చూడు...

సల్సాతో జల్సా
భార్యాభర్తల మధ్య స్ట్రెస్ తగ్గించేందుకు ఉపయోగం
సిటీలో పెరుగుతున్న సల్సా డ్యాన్సర్లు


డ్యాన్స్ చెయ్యడం అంటే అందరికీ ఇష్టమే. మొహమాటం కొద్దీ కొంత మంది నో చెప్పినా లోలోపల మాత్రం నర్తించాలనే ఆసక్తి ఉంటుంది.  సింగిల్‌గా, గ్రూప్ ఇలా చాలా రకాల నృత్యరీతులు ఉన్నా సల్సా ఒక ప్రత్యేకం. ఒక జంట పూర్తిగా మమేకమై చేస్తే సల్సాతో జల్సా చెయవచ్చు. - పెదగంట్యాడ

సల్సాలో ఫీల్
‘కళ్లల్లో కళ్లు పెట్టి చూడు..గుండెల్లో గుండె కలిపి చూడు..సందిట్లో బంధీవై చూడు’ అనే ఫీల్ ఈ డ్యాన్స్‌లో ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ డ్యాన్స్ చేస్తే స్ట్రెస్ పోయి ఒకర్ని ఒకరు ఇప్రెస్ చేసుకునే అవకాశం కలుగుతుంది. లైట్ మ్యూజిక్...రొమాంటిక్ స్టెప్స్ వావ్ అనిపించక తప్పదు.

బంధం మరింత బలపడేందుకు
పార్టీలకు పబ్బులకు వెళ్లినా నలుగురితో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి పనికొస్తుంది తప్ప ఆలుమగల మధ్య దూరం తరిగిపోదు. అందుకే 1970లో న్యూయార్క్ సిటీలో కొత్త జంటల మధ్య సల్సా నృత్యాన్ని ప్రవేశపెట్టారు. క్యూబా, కరేబియన్ దేశాల సంప్రదాయ నృత్యరీతులను అనుసరించి ప్రత్యేక పద్ధతిలో డాన్స్‌ను డిజైన్ చేశారు.

ఉపయోగాలు....
సల్సా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మానసిక ఉల్లాసం రెట్టింపు అవుతుంది. జంటల మధ్య అనుబంధాలు పెరుగుతుంది. శరీర ధారుడ్యం బలపడుతుంది. బరువు తగ్గుతారు. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎనర్జీ లాస్ అయి కేలరీస్ వేగంగా కరుగుతాయి.

డ్యాన్స్‌లో స్టైల్స్ ఇవీ...
సాల్సాలో కొన్ని స్టైల్స్ ఉన్నాయి. క్యూబన్ క్యాసినో స్టైల్, మియామి స్టైల్, ర్యూడా స్టైల్, లాస ఎంజల్స్ స్టైల్, న్యూయార్క్ స్టైల్ వంటివి ఉన్నాయి.

సల్సా డ్యాన్స్ అంటే...
నేటి హైఫై లైఫ్‌లో భార్యాభర్తలిద్దరూ విద్యావంతులే. ఇద్దరూ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్‌కు గురవుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపే అవకాశమే ఉండటం లేదు. మనసువిప్పి మాట్లాడుకోవడమే అరుదుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సల్సా డ్యాన్స్ భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యాన్ని  పెంచుతోంది. సాల్సా డ్యాన్స్ పరిచయం చేసింది ఆఫ్రికన్స్ అయినా ఇది అందరికీ మహా నచ్చేసింది. దీంతో అన్ని చోట్లా నాట్యమాడేస్తోంది.

మరిన్ని వార్తలు