వైఎస్సార్‌సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి

Published Sat, Jun 11 2016 2:47 AM

వైఎస్సార్‌సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి - Sakshi

హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా?
 
జన్నారం :  ఆదిలాబాద్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకుడు రంగు రమేశ్(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి నోటి, ముక్కు నుంచి రక్తం కారి ఉన్నందున.. ఎవరైనా కొట్టి చంపారా..? మంచం పైనుంచి కింద పడి చనిపోయాడా..? విషప్రయోగం జరిగిందా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై లింగమూర్తి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారుు.

మంచంపైనుంచి పడి..
జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామ పంచాయతీ పరిధి వినాయకనగర్‌కు చెందిన రంగు రమేశ్ పొన్కల్ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. గురువారం తోటి వార్డు సభ్యులతో కలిసి ఉట్నూర్ మండలం గండి మైసమ్మ దేవుని వద్దకు వెళ్లారు. అక్కడ అందరితో విందులో పాల్గొన్నాడు. అక్కడి నుంచి రాత్రి 10.30 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన గదిలో మంచంపై పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఏదో శబ్ధం రావడంతో అతడి భార్య శుభమణి వెళ్లి చూసింది. అప్పటికి రమేశ్ మంచం పక్కన కింద పడి ఉన్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె పక్కింటి వారి సాయంతో రమేశ్‌ను ఆటోలో జన్నారంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండడంతో లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే రమేశ్ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య శుభమణి, కూతురు రమ్య ఉన్నారు. కాగా, రమేశ్ ఏడాది క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు.


ఎలా జరిగి ఉంటుంది..
 రమేశ్‌ది హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా అనేది తెలియకుండా ఉంది. నోరు, ముక్కు నుంచి రక్త కారి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంచం పైనుంచి పడితే మనిషి చనిపోయే అవకాశం ఉంటుందా..? ఎవరైనా కొట్టారా..? లేక విషప్రయోగం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. మృతుడి అన్న రంగు నర్సయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో..
రంగు రమేశ్‌కు రాజకీయంగా మంచి పేరుంది. గతంలో టీడీపీలో క్రియూశీలకంగా పనిచేస్తూ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌కు సన్నిహితునిగా ఉన్నారు. పొన్కల్ మేజర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. గతేడాది వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం నాయకుడిగా కొనసాగారు. అతడి మృతిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నాయకులు తిలక్‌రావు, పురుషోత్తం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతిపై పూర్తి విచారణ జరపాలని పోలీసులను కోరారు.

Advertisement
Advertisement