నెలరోజులైనా..అవే కష్టాలు

7 Dec, 2016 23:06 IST|Sakshi
నెలరోజులైనా..అవే కష్టాలు
- పెన్షనర్ల అవస్థలు వర్ణనాతీతం
కర్నూలు(అగ్రికల్చర్‌): పెద్ద నోట్ల రద్దు ప్రకటించి నేటికి సరిగ్గా నెల రోజులు అయింది. గత నెల 8న పెద్దనోట్లు రద్దును కేంద్రం ప్రకటించగా, 9వ తేదీ అమలులోకి వచ్చింది. కాని ప్రజలకు మాత్రం సమస్యలు తీరలేదు. బ్లాక్‌మనీ కలిగిన వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గానీ నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ‘‘నగదు కేవలం రూ.40 లక్షలు మాత్రమే వచ్చింది. 400 మందికి మాత్రమే రూ.10వేల ప్రకారం చెల్లిస్తాం. ఈ నెలలో తీసుకున్న వారికి మళ్లీ చెల్లించం’’  అని బ్యాంకుల ఎదుట అధికారులు బోర్డులు పెడుతున్నారు. దీన్ని బట్టి నగదు కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. బుధవారం ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంకులకు  నగదు రావడంతో అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10వేల ప్రకారం నగదు ఇవ్వగా, మరికొన్ని బ్యాంకుల్లో రూ.2000లతో సరిపెట్టారు. కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచీకి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు తరలి రావడంతో బ్యాంకు పరిసరాలు కిటకిటలాడాయి. ఒకటో తేదీ గడచిపోయి వారం రోజులు అయినా ఉద్యోగులు 50 శాతం మంది జీతంలో ఒక్క రూపాయి కూడ లీసుకోలేదు. పెన్షనర్ల కష్టాలు మరింత దయనీయంగా ఉన్నాయి. బ్యాంకులకు ఉద్యోగులు, పెన్షనర్లు, పించన్‌దారులు పోటెత్తుతున్నా.. బ్యాంకుల్లో వృద్ధులు, వికలాంగులకు కనీస సదుపాయాలు లేవు. గంటల తరబడి వరుసల్లో నిలబడ లేక వీరు అల్లాడుతున్నారు. బ్యాంకర్లు వీరిపై ఎలాంటి కరుణ చూపకపోగా చులకనగా మాట్లాడుతుండటంతో తీవ్ర అగ్రహం వ్యక్తం అవుతోంది. పెన్షన్‌దారులను ట్రెజరీ బ్రాంచీ మేనేజన్‌ నిర్లక్ష్యం చేస్తుండటటంపై జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నాయకుడు నాగేశ్వరరావు మేనేజర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వీరందురూ మీలాగనే ఉద్యోగులే... వృద్ధులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడరా అంటూ మేనేజర్‌ను నిలదీశారు.
 
 ఇన్ని సమస్యలా... కె.నరసప్ప, పెన్షనర్‌
అసరాలేనిదే నడువ లేను. నేను వైద్యశాఖలో పని చేసి రిటైర్‌ అయ్యాను. పెన్షన్‌ కింద రూ.10,500 వస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి తలప్రాణం తోకకు వస్తోంది. కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్రాంచీకి ఉదయం 9 గంటలకు వచ్చాను. పట్టించుకునే వారులేరు. ఇక్కడ ఉన్న మందిని చూస్తే అస్సలు బ్యాంకులోకి వెళ్లగలుగుతానా అనే భయం పట్టుకుంది. వృద్ధుళకు ప్రత్యేక లైన్‌ పెట్టి త్వరగా నగదు ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉన్నా.. పట్టించుకోకపోవడం లేదు.
 
ఇన్ని కష్టాలు ఎప్పుడూ పడలేదు: శేషన్న, పెన్షనర్‌
పెన్షన్‌ తీసుకోవడంలో ఇన్ని సమస్యలు ఎపుడూ ఎదుర్కోలేదు. మూడు రోజులుగా నగదు కోసం బ్యాంకు చుట్టు తిరుగుతన్నాం. నగదు లేదని వెనక్కి పంపుతున్నారు. ఈ రోజు రూ.10వేల ప్రకారం ఇస్తామని బోర్డు పెట్టారు. వయో వృద్ధులను పట్టించుకనే పరిస్థితిలేదు. వృద్ధులను నేరుగా బ్యాంకులోపలికి పంపి వేగంగా నగదు చెల్లించే ఏర్పాటు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
 
మరిన్ని వార్తలు