కులాలను గుర్తించకపోవడం సిగ్గుచేటు

31 Aug, 2017 21:51 IST|Sakshi
కులాలను గుర్తించకపోవడం సిగ్గుచేటు

అనంతపురం కల్చరల్‌: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటినా తోలుబొమ్మలాట వారికి కుల గుర్తింపు లేకపోవడం సిగ్గుచేటని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సంచార విభిన్నజాతుల దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. స్థానిక కృష్ణ కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే  విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ చమన్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి సంచార జాతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతుల జీవన శైలి విభిన్నమైనదని, వారికి రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు.

చాలా మంది ఓసీ జాబితాలలో కొనసాగుతుంటే తోలుబొమ్మలాట కళాకారులకు అసలు కులమే లేకపోవడం దారుణమన్నారు. అయితే సంచార జాతుల వారి ఐక్యత అభినందనీయమని , న్యాయమైన వారి డిమాండ్ల సాధనకు చట్టసభల ద్వారా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా సీఎం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తామన్నారు. సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా, ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన  పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంచార జాతుల సంస్థ జిల్లా అధ్యక్షుడు మారెన్న, బుడగజంగం కుళ్లాయప్ప, జోగి సంఘం వెంకటేష్, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమ్మోరయ్య, బుడబుక్కల సంఘం వన్నూరప్ప, డోలప్ప, పిచ్చిగుంట్ల సంఘం అంజనయ్య, దాసరి సంఘం గోపాల్, తోలుబొమ్మలాట సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, గారెప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వేషధారణలు
అంతకు ముందు  జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో తరలివచ్చిన వారితో ర్యాలీ నిర్వహించారు. వివిధ జాతుల వారు తమ కులవృత్తులతో కూడిన వేషధారణలతో ఆకట్టుకున్నారు.  స్థానిక కృష్ణకళా మందిరం నుండి టవర్‌క్లాక్‌ మీదుగా ఎల్కేపి, సుభాష్‌రోడ్డు వరకు ర్యాలీ జరిగింది.  తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేస్తూ వారు ముందుకు సాగారు.

మరిన్ని వార్తలు