-

ఆదివాసీల విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్ర

3 Oct, 2016 00:00 IST|Sakshi
ఆదివాసీల విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్ర
  • మేడారం చేరుకున్న షెడ్యూల్‌ ఏరియా పరిరక్షణ సమితి బస్సు యాత్ర
  •  
    ఎస్‌ఎస్‌తాడ్వాయి : ఆదివాసీలను విచ్ఛినం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని షెడ్యూల్‌ ఏరియా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్, ప్రొఫెసర్‌ ఈసం నారాయరణ, రాష్ట్ర కోకన్వీనర్‌ అప్ప నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆదివాసీల జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జుడోఘట్‌ నుంచి పరిరక్షణ సమితి చేపట్టిన చైతన్య బస్సు యాత్ర ఆదివారం సాయంత్రం మేడారానికి చేరుకుంది. స్థానిక ఆదివాసీల నాయకులు బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయబద్దంగా బస్సు యాత్ర నాయకులను గద్దెలపైకి స్వాగతించారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేసేలా కేసీఆర్‌ మనస్సు మార్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6 షెడ్యూల్‌ భూగాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు.
     
     ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలి
     
     ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉండే ఆదివాసీలను మూడు, నాలుగు జిల్లాల్లో కలపడం సరి కాదన్నారు. ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, తెలంగాణ తెచ్చుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కోప్పుల రవి మాట్లాడుతూ అక్టోబర్‌ 7న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గిరిజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూజారుల సంఘం ఉపాధ్యక్షుడు చంద గోపాల్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ల పాపయ్య, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మైపతి సంతోష్, రేగ కిరణ్‌కుమార్, తుడుందెబ్బ మండల నాయకుడు శేషగిరితోపాటు ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పాల్గొన్నారు.
     
    02ఎంయూఎల్‌407: సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న ఈసం నారాయణ, నాయకులు
     
మరిన్ని వార్తలు