స్కూల్ బస్సు బోల్తా..

18 Jun, 2016 01:26 IST|Sakshi
స్కూల్ బస్సు బోల్తా..

ఇద్దరు బాలికలకు గాయాలు
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ, ఎస్సై

కాపుసోంపురం (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు కాపుసోంపురం గ్రామం వద్ద ఎస్.కోట పట్టణంలోని ఓ స్కూల్‌కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్‌కేజీ చదువుతున్న టి.మౌనిక (రాజీపేట), ఎస్.ప్రణీత (కొత్తపాలెం) విద్యార్థినులు గాయపడగా, మిగిలిన ఎనిమిది మంది సురక్షింతంగా బయటపడ్డారు. గాయపడిన బాలికలను ఎస్.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

ప్రమాదానికి సంబంధించి ఎస్సై కె.రవికుమార్, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదఖండేపల్లిలో శుక్రవారం ఉదయం బయలుదేరిన స్కూల్ బస్సులో పెదఖండేపల్లి, కొత్తపాలెం, కాపుసోంపురం గ్రామాలకు చెందిన పది మంది స్కూల్ విద్యార్థులు ఎక్కారు. చిరుజల్లులు కురవడంతో కాపుసోంపురం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఎస్సై కే. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
యజమానే డ్రైవర్
బస్సు డ్రైవర్ శ్రీను సెలవు పెట్టడంతో స్కూల్ యజమాని రంభ ఈశ్వరరావు బస్సును నడుపుతున్నాడు. అతనికి కేవలం లెర్నింగ్ లెసైన్స్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సంఘటన విషయంలో టీవీల్లో స్క్రోలింగ్ ద్వారా తెలుసుకున్న రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘరావు డీటీసీ భువనగిరి కృష్ణవేణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ కృష్ణవేణి, ఏంఎవీఐ అప్పన్న, ఎస్.కోట ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ, సంబంధిత పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామన్నారు.  
 
నిబంధనలకు విరుద్ధంగా 22 బస్సులు
జిల్లా వ్యాప్తంగా 604 స్కూల్, కళాశాలల బస్సులుండగా ఇప్పటి వరకు 422 బస్సులను తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందజేసినట్లు రవాణా శాఖ జిల్లా కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి తెలిపారు. కాపుసోంపురంలో ఆమె మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 22 బస్సులకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు హెవీ లెసైన్స్‌తో ఐదేళ్ల అనుభవం ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, వాహన నిబంధనలపై త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు