రక్షకతడి విస్తీర్ణంపై గోప్యత

1 Sep, 2016 00:14 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: వేరుశనగ పంటకు ఇస్తున్న రక్షక తడి విస్తీర్ణంపై జిల్లా యంత్రాంగం గోప్యత పాటిస్తోంది. రెండు రోజుల కిందట వరకు రోజువారీ ఎన్ని ఎకరాలకు రక్షక తడులు ఇచ్చిన వివరాలు చెబుతున్నా, ఇపుడు మాత్రం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. లక్ష ఎకరాలకు రక్షక తడి ఇచ్చి రూ.200 కోట్లు విలువ చేసే పంటను కాపాడటంతో పాటు ప్రభుత్వానికి రూ.42 కోట్ల వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మిగిలేలా చేశామని రెండు రోజుల కిందట గొప్పగా చెప్పిన వారు... ఇపుడు నోరు మెదపకపోవడం విశేషం. ఎవ్వరికీ లెక్కలు చెప్పవద్దని అధికారులకు  పాలకులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయశాఖ జేడీ, ఏపీఎంఐపీ పీడీతో పాటు మరికొందరు అధికారులకు పదుల సార్లు ఫోన్లు చేసినా ఎత్తడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. కనీసం సెల్‌ మెసేజ్‌ ఇవ్వడానికి కూడా తీరికలేకుండా పోయింది. చివరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూంను సంప్రదించినా... రక్షక తడి వివరాలు తెలియదంటూ సమాధానం ఇవ్వడం విశేషం. పంట పరిస్థితి, ఊరు, పేరు చెబితే నమోదు చేసుకుంటాం కానీ... ఇతర వివరాలు చెప్పలేమని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు