ప్రశాంతంగా ఎస్‌ఐ అభ్యర్థుల రాత పరీక్ష

27 Nov, 2016 23:40 IST|Sakshi
ప్రశాంతంగా ఎస్‌ఐ అభ్యర్థుల రాత పరీక్ష
– దరఖాస్తుదారులు 15,569
– హాజరైన అభ్యర్థులు 14,272
  కర్నూలు: పోలీసు శాఖలో ఎస్‌ఐ ఎంపికకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి గత నెల ప్రభుత్వం అనుమతించడంతో 15,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14,272 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,297 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం కర్నూలులో 26 సెంటర్లు ఏర్పాటు చేశారు. 
బయో మెట్రిక్‌ హాజరుతో అనుమతి:
 కాకినాడ జేఎన్‌టీయూ కళాశాల ఆధ్వర్యంలో ఎస్‌ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. కర్నూలు నగరంలోని 26 కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. బయోమెట్రిక్‌ సేకరణ ద్వారా (వేలి ముద్రలు) అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారు. పోలీసు శాఖ నుంచి కొంతమంది సిబ్బంది (ఫింగర్‌ ప్రింట్స్‌) బృందం నియమించి బయో మెట్రిక్‌ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయో మెట్రిక్‌ హాజరుతో అనుమతించి, 10 గంటలకు పరీక్షను ప్రారంభించారు. ఆధార్‌ లేదా, ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది మరిచిపోయి వచ్చారు. చివరి నిమిషంలో అలాంటి వారిని కూడా పరీక్షకు అనుమతించారు. డీఐజీ రమణకుమార్‌ ఆదేశాల మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ ఉదయం 10 గంటలకు పుల్లయ్య కళాశాల, కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష హాలులోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఎలక్ట్రానిక్‌ వాచ్‌లను అనుమతించరాదని ఇన్విజిలేటర్లకు దిశానిర్దేశం చేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సీఐలకు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్ష బాగా రాసి పట్టుదలతో ఉద్యోగం సంపాదించాలని అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల యాజమాన్యాలతో మాట్లాడి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  కర్నూలు డీఎస్పీ డీవీ రమణమూర్తితో పాటు పలువురు సీఐలు ఎస్పీ వెంట ఉన్నారు.       
 
మరిన్ని వార్తలు