ఎర్రవల్లిలో స్విస్ ఇంజనీర్ పర్యటన

5 Apr, 2016 19:46 IST|Sakshi
ఎర్రవల్లిలో స్విస్ ఇంజనీర్ పర్యటన

జగదేవ్‌పూర్ : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని మంగళవారం స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ) ఇంజినీర్ అండ్రెక్స్ పరిశీలించారు. ఉదయం సీడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ మురళితో కలిసి ఎర్రవల్లికి చేరుకున్న ఆండ్రెక్స్... నర్సన్నపేట, చేబర్తి గ్రామాల్లో గత ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను కూడా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉన్నతాధికారి మురళిని అడిగి అండ్రెక్స్ తెలుసుకున్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనుల్లో మేస్త్రీల పనితీరును కూడా ఆయన పరిశీలించారు. నమూనా ఇళ్లతోపాటు స్లాబ్ వేస్తున్న తీరును గమనించారు. అధ్యయనం ద్వారా తెలుసుకున్న వివరాల ఆధారంగా ఈనెల 13న రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీ కేంద్రంలో మేస్త్రీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆండ్రెక్స్ తెలిపారు. అందువల్లే ఎర్రవల్లిలో పనులను పరిశీలించినట్టు చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ భాఖీ, సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, వీడీసీ సభ్యులు సత్తయ్య, మల్లేశం, భిక్షపతి, నవీన్, మీనాక్షి గ్రూపు ప్రతినిధులు ఉన్నారు.

మరిన్ని వార్తలు