చెత్తకుప్పల్లో బాల్యం..

16 Jun, 2016 01:58 IST|Sakshi
చెత్తకుప్పల్లో బాల్యం..

పలకా బలపం పట్టి పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు చెత్త కుప్పల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటున్నారు. బడి బయట పిల్లల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు.. వారి బతుకులు మార్చడం లేదు. పసి పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఇందు కోసం ప్రభుత్వం ఏటా కోట్లలో నిధులు వెచ్చించినా బాలల బతుకులు మాత్రం మారడం లేదు. తల్లిదండ్రుల అవగాహన లోపం, పేదరికం, నిర్లక్షరాస్యత ఒక కారణమైతే.. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో బాల్యం బుగ్గిపాలవుతోంది.
- షాబాద్

మండలంలో పారిశ్రామిక వాడ ఉండడంతో ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి ప్రజలు ప్రజలు జీవనోపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు. వీరు నిరక్షరాస్యులు కావడంతో చదువు ప్రాముఖ్యత తెలియకపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపకుండా తమ వెంట ఆయా పరిశ్రమల్లో పనులకు తీసుకువెళుతున్నారు. దీంతో చిన్నతనం నుంచే చదువు లేక కేవలం ఇంటి కోసం పనులు చేస్తూ నిర్లక్షరాస్యులుగా మారి పోతున్నారు.

 ఆర్థిక ఇబ్బందులు కారణంగా..
ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ పిల్లలను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు పంపడం లేదు. వారికి ఇక్కడి భాష తెలియకపోవడంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపకుండా ఆయా పరిశ్రమల్లో పనులకు పెడుతున్నా రు. ఇప్పటికీ మండలంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో, తండాల్లో చదువుకోని వారు, భూస్వాములు, అగ్రకులాలకు చెందిన వారి దగ్గర కొంత మొత్తం లో డబ్బు అప్పుగా తీసుకుని తమ పిల్లలను పాఠశాలలకు పంపకుండా పశువుల కాపరులుగా ఉంచుతున్నారు.

పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు...
బాలకార్మికులను పనుల్లో పెట్టుకునే వ్యాపారులను , ఆయా పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అధికారులు పట్టించుకోవడం లేదు.

పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కేసులు..
బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి బయట ఉన్న ఏడుగురు పిల్లలను బడిలో చేర్పించాం. తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితాలను నాశనం చేయకుండా వారిని చదివించాలి. బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు తప్పవు.   -గోపాల్, ఎంఈఓ షాబాద్

ఆర్థిక ఇబ్బందులు సాకు కాకూడదు..
చదువుకు ఆర్థిక ఇబ్బందులు సాకు కాకూడదు. ఆర్థిక ఇబ్బందులు కొన్న నెలలు మాత్రమే ఉంటాయి. అదే చదువుకోకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ పిల్లలను మాత్రం చదివించాలి.      
- ఈదుల ఈశ్వరమ్మ, సర్పంచ్, తాళ్లపల్లి

 ప్రాముఖ్యత తెలుసుకోవాలి..
తల్లిదండ్రులు చదువు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. తమ పిల్లలను పనుల్లో పెట్టకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారిని పాఠశాలలకు పంపాలి. చదువుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. 
   - పట్నంశెట్టి జ్యోతి , ఎంపీపీ, షాబాద్

మరిన్ని వార్తలు