-

బడి.. మృత్యు ఒడి!

29 Jun, 2016 02:47 IST|Sakshi
బడి.. మృత్యు ఒడి!

తరగతి గదిలో బీరువా మీద పడి విద్యార్థిని దుర్మరణం
ప్రొద్దుటూరు శ్రీవాణి విద్యాలయంలో ఘటన
ప్రజాసంఘాల ఆందోళన
పాఠశాల సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన డీఈఓ

భుజానికి పుస్తకాల సంచి తగిలించుకుని మమ్మీ.. టాటా అంటూ ఆ చిన్నారి ముద్దులొలికే మాటలతో అమ్మకు వీడ్కోలు పలుకుతుంటే అవే తన గారాల పట్టి చివరి మాటలు అవుతాయని ఆ మాతృమూర్తి కలలో కూడా ఊహించి ఉండదు. పాఠశాలలో తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఆ పసిపాప తరగతి గదిలోని బీరువానే తనను మృత్యు ఒడికి  చేరుస్తుందని ఏమాత్రం భావించి ఉండదు. ఆడుతు.. పాడుతూ సరదాగా గడిపిన చిన్నారి కొద్ది క్షణాల్లో విగతజీవిగా మారింది. కన్నవారికి కడుపు కోత మిగిలింది.

ప్రొద్దుటూరు క్రైం: బడి.. ఆ చిన్నారి పాలిట మృత్యు ఒడిగా మారింది. తరగతి గదిలోని చెక్క బీరువా పసి పాప ప్రాణాలను కబళించింది. కోటి ఆశలతో కన్నబిడ్డను పాఠశాలకు పంపిన ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ప్రొద్దుటూరు పట్టణం గవిని సర్కిల్‌లోని శ్రీవాణి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరిగిన ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.

 ప్రొద్దుటూరు మండల పరిధిలోని మూల వారిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు బేల్దారి పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి విష్ణు అనే కుమారుడు, భార్గవి అనే కుమార్తె ఉన్నారు. వీళ్లిద్దరూ గత ఏడాది వరకూ లింగాపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించేవారు. అయితే 15 రోజుల క్రితం పిల్లలిద్దరిని గవిని సర్కిల్ సమీపంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో చేర్పించారు. విష్ణు ఒకటో తరగతి చదువుతుండగా, భార్గవిని ఎల్‌కేజీలో చేర్పించారు.  కాగా మధ్యాహ్నం సమయంలో విద్యార్థులందరూ భోజనం చేశాక నలుగురు విద్యార్థినులు ఆడుకుంటూ ఎల్‌కేజీ తరగతి గదిలోకి వెళ్లారు.

వారు ఆడుకుంటున్న సమయంలో అక్కడే చెక్క బీరువా భార్గవిపై పడింది. పెద్ద శబ్దం రావడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్లారు. భార్గవిపై పడిన బీరువాను తొలగించగా చిన్నారి రక్త గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉంది. దీంతో వెంటనే పసిపాపను సమీపంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిశీలించిన  వైద్యుడు చనిపోయినట్లు నిర్ధారించారు. తలకు గాయం కావడంతో చిన్నారి మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. విషయం తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు లక్ష్మీప్రసన్న, నరసింహులు, బంధువులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.

పాఠశాలను సీజ్ చేస్తాం : డీఈఓ ప్రతాపరెడ్డి
సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాపరెడ్డి సంఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. ఆయన లోపలికి రాగానే  విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకర మని డీఈఓ వారిని ఉద్దేశించి అన్నారు. పాఠశాలను వెంటనే సీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రక టించారు. మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వెంటనే తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఎంఈఓ క్రిష్టఫర్‌ను ఆదేశించారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని ఎలాంటి టీసీలు లేకుండా ఇతర పాఠశాలల్లో చేర్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థిని మృతికి కారణమైన క్లాస్‌టీచర్, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆఫీసు గదిని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేయడంతో కరస్పాండెంట్‌లు రమేష్‌రెడ్డి, రహంతుల్లాలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలస్వామిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు