అభివృద్ధి సరే... అసలు ‘నాకేంటి?

8 Mar, 2016 23:56 IST|Sakshi
అభివృద్ధి సరే... అసలు ‘నాకేంటి?

రూ. 100కోట్ల కేంద్ర నిధులపై తమ్ముళ్ల గురి
  పంపకాల కోసం అధికారులపై ఒత్తిళ్లు
  తేల్చుకోలేకపోతున్న అధికారులు
  ఏళ్ల తరబడి ఖర్చు కాని ప్రత్యేక అభివృద్ధి నిధులు
  వ్యక్తిగత అభివృద్ధే ధ్యేయం

 
 
 అభివృద్ధి సరే... అసలు ‘నాకేంటి?’ అన్నదే ప్రస్తుత పాలకపక్ష నేతల ధోరణి. జిల్లా పురోగతికి మోకాళ్లడ్డుతున్నారు. కాసుల కోసం గెద్దల్లా వాలిపోతున్నారు. మార్గదర్శకాలతో పనిలేకుండా పర్సంటేజీల కోసం పోటీపడుతున్నారు. పంపకాలేసి ఇచ్చేయండని అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. వీరి వ్యవహారంతో అధికారులు నలిగిపోతున్నారు. మనకెందుకులే అని వాటిజోలికి పోకపోవడంతో ఆ నిధులన్నీ మురిగిపోతున్నాయి. నేతల పుణ్యమాని వెనుకబడిన జిల్లా అలా తిరోగమనంలో  పయనిస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏటా చెరో రూ. 500కోట్లు వస్తాయని అంతా ఆశించారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ. 50కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇలా ఇప్పటివరకూ రెండు దఫాలుగా రూ. 100కోట్లు మంజూరు చేసింది. కోట్లల్లో నిధులొచ్చేసరికి పచ్చకళ్లు వాటిపై పడ్డాయి. పనుల్ని దక్కించుకుంటే పర్సంటేజీల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో నేతలంతా పోటీ పడ్డారు. తమకే ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు. జిల్లా కేంద్రానికి పక్కనున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఏకంగా తాను చెప్పినట్టు చేయాలని పనుల జాబితా కూడా ఇచ్చేశారు. ఆయనతో పాటు సిండికేట్‌గా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేతకూడా గట్టిగా అడిగించారు. ఈ క్రమంలో అంతకుముందు ప్రతిపాదించిన వాటిలో రూ. 5కోట్ల వరకు ఖర్చు పెట్టి, మిగతా మొత్తాన్ని దేనికి ఖర్చు పెట్టాలో, ఏ నియోజకవర్గానికి కేటాయించాలో తేల్చుకోలేక అధికారులు పక్కన పెట్టేశారు. ఏడాదిగా ఆ నిధులు ఎందుకూ కొరగాకుండానే ఉండిపోయాయి.
 
 ఇవీ మార్గదర్శకాలు
 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో చేపట్టబోయే పనులు ఎలా ఉండాలో నిర్దేశించింది. స్థూల జాతీయోత్పత్తి పెరగడానికి, కరువును తగ్గించడానికి, సామాజిక అభివృద్ధి సాధించడానికి, రెండు అంకెల వృద్ధి రేటు సాధించేందుకు దోహదపడే పనులు మాత్రమే చేపట్టాలి సూచించింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ శాఖ, ఇరిగేషన్, సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులు చేపట్టాలని పేర్కొంది. కానీ ఆ దిశగా అధికారులు పనులు ప్రతిపాదించలేకపోయారు. ఆ నిధుల్ని తమకే అప్పగించాలని, తమ నియోజకవర్గాల్లోనే ఖర్చు పెట్టాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిళ్లు చేస్తూనే ఉన్నారు.
 
 పనుల వినియోగానికి తాజా ఆదేశాలు
 నిరుపయోగంగా ఉన్న నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. ఇప్పటికే విడుదలైన రూ. 100కోట్లతో పాటు భవిష్యత్‌లో విడుదలయ్యే మరో రూ. 100కోట్లకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వాటి ఆధారంగా చేస్తారో? లేదంటే ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి పంపకాల ప్రకారం ప్రతిపాదిస్తారో చూడాలి.  
 

మరిన్ని వార్తలు