-

రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూత

2 Jun, 2017 22:59 IST|Sakshi
రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూత
– పేద రైతులకు ఉచితంగా 188  కోడెదూడల పంపిణీ
– పీఠాధిపతి చేతుల మీదుగా వితరణ
 
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి కృపతో రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూతనిస్తోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. శ్రీమఠం గోశాలలో శుక్రవారం పేద రైతులకు ఉచితంగా కోడెదూడల వితరణ కార్యక్రమం చేపట్టారు. గోశాలలో పురుడోసుకున్న 188 కోడెదూడలను 94 మంది రైతులకు అందజేశారు. ముందుగా వాటికి పూజలు గావించి డిప్‌ పద్ధతిలో రైతులకు పంపిణీ చేశారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో సేద్యానికి ఎద్దులు లేక అల్లాడిపోతున్న రైతులకు అండగా శ్రీమఠం నిలుస్తుందన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధానంలో పెరిగిన పశువులను ఆరాధ్యంగా భావిస్తామని, వాటిని బాధించకుండా చూసుకోవాలన్నారు.
 
అవసాన దశలో విక్రయించడం, కబేళాలకు తరలించడం చేయొద్దన్నారు. ఏదైనా పోషణ భారమనిపిస్తే తిరిగి గోశాలకు అప్పగించాలని సూచించారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా కోడెదూడలు అందజేస్తున్నామన్నారు. రైతులు అంతే నమ్మకంతో పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.  ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పండలు పండి రైతులోకం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల రైతులకు కోడెదూడలు అందజేశారు. వితరణ స్వీకరించిన రైతులు శ్రీమఠానికి, స్వామిజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజాఎస్‌ గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌ శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతిఆచార్, గోశాల బాధ్యులు రఘుదేశాయ్, గుంజిపల్లి శ్రీనివాస పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు