చెరకు టన్ను ధర రూ.2550

2 Jun, 2017 09:49 IST|Sakshi
చెరకు టన్ను ధర రూ.2550

► మద్దతు ధర ప్రకటించిన కేంద్రం
► రాష్ట్ర సుగర్‌ కేన్‌ కమిషనర్‌కు అందిన ఉత్తర్వులు
► రూ.3వేలైనా ఇవ్వాలంటున్న రైతులు


చోడవరం: ఈ ఏడాది చెరకు మద్దతు ధరను కేంద్రం ఇటీవల ప్రకటించింది. టన్నుకు రూ.2550 చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సుగర్‌ కేన్‌ కమిషనర్‌కు ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా కనీస మద్దతు ధర లేక తీవ్ర నిరాశతో ఉన్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామం.కేంద్ర ప్రభుత్వ ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ మండలి సమావేశంలో ఇటీవల టన్నుకు రూ.250పెంచుతూ ప్రకటించారు.

గతేడాది టన్నుకు రూ.2225లు చెల్లించిన కేంద్ర ఈ ఏడాది మరో రూ.250లు పెంచింది. అన్ని ఫ్యాక్టరీలు టన్నుకు రూ.2475 చెల్లించాల్సి ఉంటుంది. గోవాడ ఫ్యాక్టరీ గతేడాది రూ.2300 ఇవ్వగా ఈఏడాది పెరిగిన ధరతో టన్ను చెరకు ధర రూ.2550 చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా మరో రూ. 60 రవాణా చార్జిగా ఇవ్వాలి. అంటే రానున్న క్రషింగ్‌ సీజన్‌లో గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2610 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ధర కొంత పర్వాలేకపోయినప్పటికీ ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు రీత్యా టన్నుకు కనీసం రూ.3వేలైనా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే చెరకు మద్దతు ధర పెరగడంపై ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో పంచదార ధర క్వింటా రూ.3750 ఉంది. ఈ ధర ఇలా ఉన్నా,కాస్త  పెరిగినా ఫ్యాక్టరీ పెరిగిన చెరకు ధర ఇచ్చేందుకు ఇబ్బంది ఉండదు. రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చెరకు సాగు పెట్టుబడులు బాగాపెరిగిపోవడం వల్ల ప్రస్తుతం ప్రకటించిన ధర కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం కొంత సాయం చేసి మద్దతు ధర పెంచితే రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న 11సహాకార చక్కెర కర్మాగారాల్లో కేవలం నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అవి కూడా మన జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, తాండవ కాగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లా భీమసింగ ఫ్యాక్టరీలు.

మిగతా ఫ్యాక్టరీలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతబడ్డాయి. అయితే క్రషింగ్‌కు సిద్ధమవుతున్న 4ఫ్యాక్టరీలు కూడా గతేడాది చెరకులేక లక్ష్యంలో కేవలం 60 శాతమే క్రషింగ్‌ చేసి చతికిలపడ్డాయి. పంచదారకు మంచి ధర ఉన్నప్పటికీ చెరకు పంట లేక ఆశించిన మేర క్రషింగ్‌ చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాయి. చెరకు విస్తీర్ణం పెంచి ఈ ఏడాది ఆశించిన మేర ఫ్యాక్టరీలు క్రషింగ్‌ లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పెరిగిన ధర రైతులకు చెల్లించకలేకపోగా ఫ్యాక్టరీలు కూడా మూతపడే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు