ప్రకాశంపై ప్రభుత్వం చిన్నచూపు

10 Jul, 2017 02:18 IST|Sakshi
ప్రకాశంపై ప్రభుత్వం చిన్నచూపు

తక్షణం సమస్యలు పరిష్కరించాలి
వెలుగొండను వెంటనే పూర్తి చేయాలి
రామాయపట్నం పోర్టును తక్షణం చేపట్టాలి
జిల్లాను వెనుకబడిన జాబితాలో చేర్చాలి
ఫ్లోరైడ్‌ బాధితులకు సురక్షిత నీటిని అందించాలి
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
జిల్లా సమస్యలపై వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో బాలినేని తీర్మానం

 
ఒంగోలు: ప్రకాశం జిల్లాను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా చిన్నచూపు చూస్తోందని, ప్రధాన సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా వరప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని  ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జిల్లాప్రజలకు తాగునీరు, సాగునీరందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో బాలినేని జిల్లా ప్రధాన సమస్యలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 2003–2004 ఆర్థిక సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు ఆ ఏడాదిబడ్జెట్‌లో కేవలం 9.6కోట్లు మొక్కుబడిగా కేటాయించారని విమర్శించారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో టీడీపీ ప్రభుత్వ హయంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్లలో వెలుగొండ ప్రాజెక్టుకు 1600కోట్ల నిధులు విడుదలచేసి పనులు వేగవంతంగా జరిగేలా చూశారన్నారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నామమాత్రంగానే నిధులు వెచ్చించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ. 600కోట్లు నిధులు కేటాయించినట్లు చెబుతున్నా, అందులో ఖర్చు చేసింది రూ.400కోట్లు మాత్రమేనన్న విషయాన్ని గుర్తు చేశారు. 2017 బడ్జెట్‌లో రూ.200కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 4287కోట్లు ఖర్చు చేసినట్లు బాలినేని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 2330కోట్లు అవసరం అవుతాయన్నారు. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. తక్షణం ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
జిల్లాలోని రామాయపట్నం పోర్టును కేంద్రం తక్షణం ప్రకటించాలని బాలినేని రెండవ తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాకు నీరు, పోర్టు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. అదే జరిగితే జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోదన్నారు. నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం పోర్టుకు అనుకూలత లేదని కేంద్రం తేల్చినందున తక్షణం చంద్రబాబు ప్రభుత్వం రామాయపట్నం పోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశార

రాయలసీమతోపాటు వర్ష కరువులతో వెనుబకడిన ప్రకాశం జిల్లాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని బాలినేని డిమాండ్‌ చేస్తూ మూడో తీర్మానం చేశారు. జిల్లాలోని 1200గ్రామాల్లో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో దాదాపు 430మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వెలుగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తిచేసి కెనాల్స్‌ ద్వారా ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు తాగునీరు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జిల్లాలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారని, గత మూడేళ్ల కాలంలో 70మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని బాలినేని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్లీనరీలో ఐదో తీర్మానం చేశారు.     

మరిన్ని వార్తలు