తాడిపత్రిలో ముసలం

12 Jan, 2017 00:35 IST|Sakshi
తాడిపత్రిలో ముసలం

- అధికార పార్టీలో విభేదాలు
- మునిసిపల్‌ కౌన్సిల్‌ వేదికగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి గొడవ
- ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సొంత పార్టీ కౌన్సిలర్‌


తాడిపత్రి : తాడిపత్రిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ముఖ్యంగా  జేసీ వర్గానికి, టీడీపీలోని పాత వర్గీయులకు మధ్య సఖ్యత లేదన్న విషయం బహిర్గతమైంది. బుధవారం తాడిపత్రి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా ముగియడమే ఇందుకు నిదర్శనం. మునిపాలిటీలో అవినీతి జరుగుతోందని,  షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదులను బినామీలకు తక్కువ «అద్దెకు కట్టబెట్టారని ప్రచారం చేస్తూ కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి తనపైనే కరపత్రాలు వేశారంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి  ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే ఆయన మూడు సమావేశాల వరకు రాకుండా సస్పెండ్‌ చేయించారు. దీనికి నిరసనగా బాధిత కౌన్సిలర్‌ మునిసిపల్‌ కార్యాలయంలోనే బైఠాయించడం, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది.

కొంతకాలంగా 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డి.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని జయచంద్రారెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన కూడా చేపట్టారు. జేసీ సోదరులు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే టీడీపీ నాయకులైన జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డితో విభేదాలుండేవి. చాలాసార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దాడులు, ప్రతిదాడులకూ పూనుకొని పోలీస్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే..2014 ఎన్నికల్లో జేసీ సోదరులు అనూహ్యంగా కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరారు. అప్పట్లోనూ వీరి చేరికను జయచంద్రారెడ్డి సోదరులు వ్యతిరేకించారు. అధిష్టానం బుజ్జగించినా అంగీకరించలేదు.

చివరికి అధిష్టానం ఒత్తిడితో ఆ ఎన్నికల్లో కలిసి పని చేసేందుకు అంగీకరించినా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వారిని అంతగా ఆదరించలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత టీడీపీ అధిష్టానం జగదీశ్వరరెడ్డికి తాడిపత్రి మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవిని ఖరారు చేసినా చివరి నిమిషంలో మరొకరికి ఇచ్చింది. జేసీ జోక్యం వల్లే తమకు ఆ పదవి రాలేదని జగదీశ్వరరెడ్డి సోదరులు ఆరోపించారు. అంతేకాకుండా జగదీశ్వరరెడ్డి గ్రానైట్‌ ముడిసరుకు రవాణా చేసే విషయంలోనూ ఎమ్మెల్యే కావాలనే అధికారులను పంపించి దాడులు చేయించి కేసులు నమోదు చేయించారని జయచంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే పది రోజుల క్రితం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అభివృద్ధి పేరుతో తాడిపత్రి మున్సిపాలిటీని దోచుకుంటున్నారని, విచారణ చేయించాలని మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి కార్యక్రమంలోనూ జయచంద్రారెడ్డి సొంతంగానే పర్యటించారు.  ఇలా చాలా విషయాల్లో వీరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి.

>
మరిన్ని వార్తలు