నమ్మించి... నట్టేట ముంచి.!

6 Apr, 2016 16:41 IST|Sakshi

నకిలీ బీ-ఫారాలతో పేదలను వంచించిన తమ్ముళ్లు
ఒక్కో ఇంటికి రూ 1.75 లక్షల వంతున వసూలు
అధికారుల స్టాంపులు, సంతకాలు సైతం ఫోర్జరీ
గుంటూరు రూరల్ చౌడవరంలో వెలుగుచూసిన అక్రమాలు
తహశీల్దారు పరిశీలనలో నకిలీ పత్రాల గుర్తింపు
నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు
 
ప్రభుత్వం మనది.. ఏంచేసినా మనల్ని అడిగేదెవరు.. అన్నట్టుంది జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ల తీరు. ముఖ్యనేతల అండదండలతో ఏమాత్రం జంకు లేకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. నిరుపేదలు, అమాయకులను ఎంచుకొని మోసగిస్తున్నారు.

తమ పలుకుబడి ఉపయోగించి ఇళ్లు, నివేశన స్థలాలు మంజూరు చేయిస్తామని లక్షల రూపాయలు దండుకొంటున్నారు. జన్మభూమి కమిటీ ల పేరుతో గ్రామాల్లో పెత్తనం చెలాయించడం నుంచి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించే స్థాయికి ఎదిగారు. తాము మింగే అవినీతి సొమ్ములో ముఖ్యనేతలకూ కొంత ముట్టజెబితే ఆ తర్వాత ఏ ఇబ్బంది వచ్చినా వారే చూసుకుంటారనేది వీరి ధీమాగా కనిపిస్తోంది.
 
 
 గుంటూరు రూరల్ :  జిల్లాలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. నకిలీ పత్రాలను ప్రభుత్వ బీ ఫారాలుగా నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన గుంటూరు రూరల్ మండలం చౌడవరంలో వెలుగుచూసింది. గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులుగా చెప్పుకొంటున్న నలుగురు టీడీపీ మండల స్థాయి నాయకులు ప్రభుత్వ అధికారుల రౌండ్‌సీళ్లు, సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ బీఫారాలు సృష్టించి పేదలకు అంటగట్టారు.

రాజధాని నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రావడం, స్థలాలకు పత్రాలు లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోననే అమాయకులు వీరిని ఆశ్రయిస్తుండటం అక్రమాలకు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా నకిలీ పత్రాలను ప్రజలకు అందజేసి, నాలుగు విడతలుగా ఒకొక్కరి నుంచి రూ 1.75 లక్షలకు పైగా దండుకున్నారని సమాచారం.


గుంటూరు నగరంలో రోడ్ల పక్కన గుడిసెల్లో నివసించే పేదలను 1998 సంవత్సరానికి ముందు ఖాళీ చేయించిన అధికారులు, వారికి నగరశివారు చౌడవరం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. ఈ స్థలాలకు మంజూరు చేసిన బీ ఫారాలు కొందరికి చేరగా మరికొందరికి అందలేదు.

అనంతరం మరికొందరు మిగిలిన ప్లాట్లను కొనుగోలు చేసి కొందరు, ఆక్రమించుకొని మరికొందరు ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. చౌడవరం గ్రామంలో ఇళ్లు, స్థలాలు, స్థలాలకు పత్రాలు లేని పేదలను ఎంచుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు తమ పలుకుబడితో పత్రాలు ఇప్పిస్తామని వారిని నమ్మించారు. గతంలో పనిచేసిన తహశీల్దారు భానుప్రకాష్ సంతకాలను, రెవెన్యూ స్టాంప్‌లు, రౌండ్‌సీల్స్‌ను తయారు చేయించారు. వాటి సాయంతో నకిలీ పత్రాలను సృష్టించి పేదల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ వ్యవహారం ఆనోట ఈ నోట తహశీల్దారు రజనీకుమారి దృష్టికి వచ్చింది.
 
తప్పులు దొర్లాయంటూ పత్రాలు వెనక్కి..
తమ వ్యవహారం అధికారుల దృష్టికెళ్లిందని తెలుసుకుని ఇందులో ముఖ్యపాత్ర పోషించిన నలుగురు తెలుగు తమ్ముళ్లు అర్ధరాత్రి గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లారు. తాము ఇచ్చిన పత్రాల్లో చిన్నపాటి తప్పులు దొర్లాయని, వాటిని మార్చి మళ్లీ ఇస్తామని చెప్పి వెనక్కు తీసుకున్నారని సమాచారం.

కాగా కొందరు తమకిచ్చిన పత్రాలను జిరాక్స్ తీశామని తెలపటంతో తహశీల్దారు సోమ, మంగళవారాల్లో గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వారి వద్ద ఉన్నవి నకిలీ పత్రాలేనని గుర్తించారు. పేదలను మోసం చేస్తున్న వారిపై మంగళవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ముఖ్యనేత, ప్రజాప్రతినిధులు ఈ అక్రమాల్లో ప్రమేయం ఉండడంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందువెనుకా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
 
పత్రాలు నకిలీవని తేలింది..
రెండురోజులపాటు చౌడవరం గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాను. స్థానికుల వద్ద ఉన్న పత్రాలను పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. దీనిపై మంగళవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వీలైనంతర త్వరగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
 - రజనీకుమారి, తహశీల్దారు, గుంటూరు రూరల్ మండలం

>
మరిన్ని వార్తలు