ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి

11 May, 2017 00:01 IST|Sakshi
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :  క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్‌ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్‌ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్‌ఎస్‌ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్‌ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సాల్మన్‌ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్‌–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్‌ జీవో సంఘ ఉపాధ్యక్షుడు  రమేష్, ఆర్‌యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్‌ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్‌ యూఎస్‌ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్‌ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్‌కుమార్, సర్వశిక్షాభియాన్‌  సీఎంవో రూజ్‌వెల్ట్‌ పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు