కృష్ణా పుష్కరాల్లో తెనాలి మువ్వల సవ్వడి

25 Aug, 2016 23:44 IST|Sakshi
కృష్ణా పుష్కరాల్లో తెనాలి మువ్వల సవ్వడి
 
తెనాలి (గుంటూరు): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తజన కోటిని తన అక్కున చేర్చుకుని ఆశీస్సులిచ్చిన కృష్ణవేణి, తన సామీప్యంలో మువ్వల సవ్వడులకు పులకరించింది. చిన్నారుల్నుంచి, ప్రఖ్యాత నర్తకీమణుల వరకు భక్తి తన్మయత్వంలో చేసిన నృత్య ప్రదర్శనలను కనులారా వీక్షించి, మురిసింది. కృష్ణమ్మ్మ సన్నిధిలో భక్త జనం ఎదుట తమ నాట్యకళాప్రతిభను చాటడాన్ని పలువురు ఔత్సాహిక, వర్ధమాన కళాకారులు తమకది ఒక అద్భుత అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్ర భాషా, సాంస్కతికశాఖ నిర్వహించిన సాంస్కృక ప్రదర్శనల్లో తెనాలికి చెందిన బాల, యువ నర్తకిలు వందమందికి పైగా పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదొక అనిర్వచనీయమైన జ్ఞాపకంగా తమ జీవితంలో మిగిలిపోతుందని వారు సంబరపడుతున్నారు.
శ్రీలక్ష్మీ నృత్యకళా కేంద్రం నుంచే 50 మంది...
కళల కాణాచి తెనాలిలో శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం విద్యార్థులు యాభై మంది వరకు పుష్కరాల సందర్భంగా ప్రదర్శనలివ్వడం విశేషం. కళాకేంద్రం నృత్యగురువు ఎ.వెంకటలక్ష్మి నేతృత్వంలో అష్టలక్ష్మి వైభవం, శంకరశ్రీగిరి, శివాష్టకం, మహిళాసుర మర్ధిని నృత్యరూపకాలను వీరు ప్రదర్శించారు. మరొక ప్రముఖ నత్యకారిణి, నృత్యశిక్షకురాలు బి.రంగనాయకి మంగళగిరి ఎయిమ్స్, పుష్కరనగర్‌–సీతానగరంలో తన శిష్యులు బి గ్రేడ్‌ కూచిపూడి నర్తకి బి.కమలాశ్రుతి, మాధవి, సాయిస్వరూప్, సాయిమోహన్‌లతో కలిసి వినాయక కౌతం, మరకత, శ్రీరంగశబ్దం, దశావతార శబ్దం అంశాలను ప్రదర్శించారు. 
మళ్లీ మెరిసిన తేజస్వి
బాల్యం నుంచి నాట్యంలో విశేష ప్రతిభ ప్రదర్శిస్తున్న ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, ఈ పర్యాయం ఎం.సురేంద్ర (హైదరాబాద్‌) శిక్షణలో ప్రత్యేకంగా సాధన చేసిన ‘అర్ధనారీశ్వరం’ అంశాన్ని ప్రదర్శించారు. శ్రీశైలంలోని భ్రమరి కళామందిరం, మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. వర్ధమాన నత్యకారిణి ఆలపాటి ప్రజ్ఞ, కొత్త లక్ష్మీసాయి జిష్ణవి గురువు ఎండీ గిరి నేతృత్వంలో అవనిగడ్డ, పెనుమూడి ఘాట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మంగళగిరి ఆలయం, ఉద్దండరాయునిపాలెం, తాళాయపాలెంలో తరంగం, మహిళాసుర మర్దిని, రామాయణ శబ్దం, బ్రహ్మంజలి ప్రదర్శనలిచ్చారు. శ్రీలాస్య కూచిపూడి నాట్యాలయం గురువు జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జంధ్యాల శ్రీలాస్య, శ్రీలేఖ సోదరీమణులు దాచేపల్లి మండలం పొందుగల ఘాట్‌ వద్ద నాట్యప్రదర్శన చేశారు. మరొక చిన్నారి మన్నె టీనాచౌదరి గురువు వేదాంతం దుర్గాభవాని ఆధ్వర్యంలో గోరంట్ల, ఎయిమ్స్, శైవక్షేత్రంలో మంజునాధ, పౌర్ణమి, రామాయణ శబ్దం అంశాల్లో నర్తించింది. వర్ధమాన నర్తకిలు ఎన్‌.అక్షయ, దివ్యలక్ష్మి, వసంత, నత్యగురువు నిర్మలా రమేష్‌ శిష్యురాళ్లు మరికొందరు పుష్కర సాంస్కృతిక సంరంభాల్లో తమ నర్తనంతో పాలుపంచుకున్నారు.
 
మరిన్ని వార్తలు