జ్వర మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌

9 Aug, 2016 16:48 IST|Sakshi
అరకులోయ : ఏజెన్సీ ప్రాంతంలో జర్వాలతో గిరిజనులు మరణిస్తే వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ 
ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు. అరకులోని పర్యాటక శాఖ పున్నమి వేలీ రిసార్ట్స్‌ గోష్టి సమావేశ 
మందిరంలో ఏజెన్సీలోని వైద్యాధికారులు, అరకు నియోజకవర్గం పరిధిలోని వైద్య సిబ్బందితో సమావేశం 
నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. గిరిజన గ్రామాలలో జ్వరాలతో ఎవరైనా 
మరణిస్తే.. డాక్టర్‌తోపాటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు రుజువైతే సస్పెన్షన్‌తోపాటు క్రిమినల్‌ 
కేసు నమోదు చేస్తామన్నారు. ఆరోగ్య శిబిరాలు, పిన్‌ పాయింట్‌ ప్రోగ్రాంలు నిర్వహించి వ్యాధుల 
అదుపునకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఆస్పత్రిలో మందులు, అంబులెన్సులు సిద్ధంగా 
ఉంచుకోవాలని, మందులు లేవని వారం ముందు చెబితే ఎక్కువ మందులున్న ఆస్పత్రుల నుంచి 
సర్దుబాటు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో రోగులకు వైద్య సేవలందించేందుకు వైద్యులకు 
ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కొంతమంది రోగులు ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడరని, 
అలాంటి వారిని పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
మండలాభివద్ధి అధికారి, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
వారంలో పోస్టుల భర్తీ
ఏజెన్సీలో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, వైద్యసిబ్బంది పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని కలెక్టర్‌ 
ప్రవీణ్‌ చెప్పారు. ఎపిడమిక్‌ సీజన్‌ను దష్టిలో పెట్టుకొని కొత్తగా 95 మంది వైద్య సిబ్బందిని 
నియమించామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నివాస్,  ఇన్‌చార్జీ పీఓ లోతేటి శివశంకర్, 
డీఎంఅండ్‌ హెచ్‌ఓ సరోజిని, జెడ్పీ సీఈఓ జయప్రకాష్, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, టూరిజం 
ఈడీ శ్రీరాములు నాయుడు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు