పుట్టిన బిడ్డకు ఆరు మాసాల వరకు తల్లి పాలివ్వాలి

6 Aug, 2016 23:06 IST|Sakshi
పుట్టిన బిడ్డకు ఆరు మాసాల వరకు తల్లి పాలివ్వాలి
మహారాణిపేట(విశాఖ): ఆస్తులివ్వకపోయినా పర్వాలేదు గాని పుట్టే ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు పాలిచ్చి మంచి ఆరోగ్యానివ్వాల్సిన బాధ్యత తల్లులదేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన తల్లిపాల రాష్ట్రస్థాయి సదస్సును ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ అందం పోతుందని పట్టణాల్లో, అవగాహన లేక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 58 శాతం తల్లులే తమ బిడ్డలకు పాలిస్తుండగా.. వారిలో 70 శాతం మందే ఆరుమాసాల వరకు పాలిచ్చే వారున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా బిడ్డల అనారోగ్యానికి పరోక్షంగా వారే కారకులవుతున్నారని అన్నారు. గర్భిణులు, బాలంతలు, పిల్లల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేస్తోందని.. ప్రతిపైసా వారికి చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా 35 వేల కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులతో 7వేల అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 14వ ఆర్ధిక సంఘం నిధులతో విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మొదటి విడతగా రూ.654 కోట్లు విడుదల చేసినట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్‌ కె.ఆర్‌.బి.హెచ్‌.ఎన్‌. చక్రవర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు